ఐదు నెలల్లో 42 కిలోల.. గోల్డ్ స్మగ్లింగ్

ఐదు నెలల్లో 42 కిలోల.. గోల్డ్ స్మగ్లింగ్
  • శంషాబాద్ ఎయిర్​పోర్టు అడ్డాగా స్మగ్లర్ల దందా
  • రకరకాల మార్గాల్లో బంగారం తరలింపు
  • క్యాప్స్యూల్స్ రూపంలో, లో దుస్తుల్లో అక్రమ రవాణా
  • గత ఐదు నెలల్లో 68 మంది అరెస్ట్
  • వారిలో 8 మంది మహిళా స్మగ్లర్లు

హైదరాబాద్, వెలుగు: 
శంషాబాద్ ఎయిర్​పోర్ట్ బంగారం స్మగ్లింగ్‌‌కు అడ్డాగా మారింది. ఢిల్లీ, చెన్నై, ముంబై విమానాశ్రయాల్లో నిఘా పెరగడంతో శంషాబాద్‌‌ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ మీదుగా గోల్డ్‌‌ స్మగ్లింగ్‌‌ భారీగా జరుగుతోంది. బంగారం బిస్కెట్లను అక్రమార్కులు పేస్ట్‌‌గా మార్చి తరలిస్తున్నారు. కస్టమ్స్ అధికారులు, స్కానర్లకు చిక్కకుండా ప్లాన్ చేస్తున్నారు. రోజురోజుకు మారుతున్న స్మగ్లింగ్‌‌  ట్రెండ్‌‌ను చూసి అధికారులే అవాక్కవుతున్నారు. మహిళా ప్యాసింజర్లు శానిటరీ ప్యాడ్లలో, లో దుస్తుల్లో, శరీరంలోని ప్రైవేట్​ పార్ట్స్​లో తరలిస్తున్న గోల్డ్ పేస్ట్‌‌ను గుర్తించేందుకు కస్టమ్స్‌‌ అధికారులకు సవాల్‌‌గా మారింది. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు దాదాపు రూ.32 కోట్ల విలువైన 42 కిలోల బంగారు బిస్కెట్లను కస్టమ్స్‌‌, డీఆర్‌‌‌‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 68 మందిని అరెస్టు చేశారు. వారిలో 8 మంది మహిళా స్మగ్లర్లు కూడా ఉన్నారు. మే15న మస్కట్‌‌  నుంచి వచ్చిన మహిళా ప్యాసింజర్‌‌‌‌ తన శానిటరీ ప్యాడ్‌‌లో రూ.77,90,534 విలువ చేసే 1.5 కిలోల గోల్డ్  పేస్ట్‌‌  స్మగ్లింగ్  చేస్తూ పట్టుబడింది. అలాంటి వారిపై కస్టమ్స్ ఇంటెలిజెన్స్‌‌ అధికారులు నిఘా పెట్టి స్కానర్లతో పట్టేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారంలో 10 శాతం ట్యాక్స్‌‌లతో వదిలేస్తున్నా మిగతా 90 శాతం బంగారాన్ని ఆర్బీఐలో డిపాజిట్ చేస్తున్నారు. కస్టమ్స్‌‌ స్కానర్లు, డీఆర్‌‌‌‌ఐ నిఘాకు చిక్కకుండా ఏటా సుమారు 100 కిలోలకు పైగా గోల్డ్‌‌  బిస్కెట్లు స్మగ్లింగ్ జరుగుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. స్మగ్లింగ్  చేస్తున్న బంగారంలో 35 శాతం మాత్రమే అధికారులకు దొరుకుతోంది. మిగతా 65 శాతం గోల్డ్‌‌  మాఫియా చేతికి వెళ్తోంది.

ల్యాండ్‌‌ మార్క్‌‌, డ్రెస్ కోడ్‌‌తో ..

గోల్డ్‌‌ స్మగ్లింగ్‌‌లో క్యారియర్ నెట్‌‌వర్క్‌‌  కీలకంగా మారింది. ఒకరితో ఒకరికి కాంటాక్టు లేకుండా ఈ సిస్టమ్  పనిచేస్తోంది. ట్రావెల్‌‌  ఏజెంట్లతో కలిసి ప్యాసింజర్లతో గోల్డ్  స్మగ్లింగ్ చేయిస్తున్నారు. ప్రయాణికుల బ్యాగ్స్‌‌లో గోల్డ్ బిస్కెట్స్‌‌ను ప్యాక్ చేసి తరలిస్తున్నారు. కేవలం ల్యాండ్ మార్క్‌‌, డ్రెస్‌‌ కోడ్‌‌, జీపీఎస్‌‌  ట్రాకింగ్  ద్వారా మాత్రమే బంగారు బిస్కెట్లు చేతులు మారుతున్నాయి. ఇందుకోసం హైదరాబాద్‌‌  నుంచి అరబ్  దేశాలకు వెళ్లే వారిని ఏజెంట్లు స్మగ్లర్లుగా వినియోగించుకుంటున్నారు. 

విదేశాల నుంచి వచ్చే గోల్డ్‌‌  బిస్కెట్లను రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. క్యారియర్లు, రిసీవర్లకు కమీషన్లు ఇస్తూ రూ.వేల కోట్ల గోల్డ్‌‌ బిజినెస్‌‌  అక్రమంగా నిర్వహిస్తున్నారు. కస్టమ్స్, డీఆర్‌‌‌‌ఐ తనిఖీల్లో క్యారియర్లు దొరుకుతున్నా రిసీవర్లు, ప్రధాన స్మగ్లర్లు మాత్రం పట్టుబడడం లేదు.

బిస్కెట్లను పేస్ట్‌‌గా మార్చి..

స్మగ్లర్లు గోల్డ్  బిస్కెట్లను పేస్ట్‌‌గా మార్చి దేశాలు దాటిస్తున్నారు. షూస్, సాక్స్‌‌, లగేజీ బ్యాగ్స్‌‌లోని స్టీల్‌‌ రాడ్లు, కాఫీ పౌడర్, ఎలక్ట్రానిక్స్ గూడ్స్‌‌, ఎమర్జెన్సీ లైట్స్‌‌, బ్యాటరీస్‌‌, బెల్ట్స్‌‌, కుక్కర్లు, మిక్సీలు, సిగ‌‌రెట్ ప్యాకెట్లలో ప్యాక్ చేసి కిలోల కొద్ది బంగారాన్ని తరలిస్తున్నారు. ప్లాస్టిక్ పైపుల్లో బంగారం తీగలు పెడితే స్కానర్లకు దొరికే అవకాశం ఉండదు  కాబట్టి ఎక్కువగా గోల్డ్ బిస్కెట్లు, ఆభరణాల చుట్టూ పాలిథీన్  కవర్లు, టేప్‌‌తో ప్యాక్ చేస్తున్నారు. అలాగే  గోల్డ్ బిస్కెట్లను పౌడర్‌‌‌‌గా మార్చి క్యాప్స్యూల్స్  తయారు చేస్తున్నారు. వాటిని మహిళా స్మగ్లర్లు ప్రైవేట్​పార్ట్స్​లో దాచుకొని స్మగ్లింగ్ చేస్తున్నారు. గమ్యస్థానాలకు చేరిన తరువాత పేస్ట్‌‌ను గోల్డ్‌‌ బిస్కెట్లుగా మార్చి బ్లాక్ మార్కెట్‌‌లో అమ్ముతున్నారు.