బీసీ రిజర్వేషన్లపై స్పీడప్ ..ఇవాళ(జులై 15) గవర్నర్ వద్దకు ఆర్డినెన్స్ ముసాయిదా!

బీసీ రిజర్వేషన్లపై స్పీడప్ ..ఇవాళ(జులై 15) గవర్నర్ వద్దకు ఆర్డినెన్స్ ముసాయిదా!
  •  
  • 2018 పంచాయతీరాజ్​ చట్టంలోని సెక్షన్ 285(ఏ)కు సవరణ
  • ఆర్డినెన్స్ ముసాయిదా​ రెడీ చేసిన పంచాయతీ రాజ్ శాఖ
  • గవర్నర్​ ఆమోదం పొందిన వెంటనే 42 % రిజర్వేషన్ల కోసం జీవో
  • వారం, పది రోజుల్లో బీసీ డెడికేటెడ్​ కమిషన్  రిపోర్ట్​
  • ఆ వెంటనే స్థానిక ఎన్నికలకు షెడ్యూల్​ విడుదలయ్యే చాన్స్​


 హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం స్పీడప్ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం -2018 లోని సెక్షన్ 285(ఏ)కు సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ముసాయిదాను పంచాయతీ రాజ్ శాఖ సిద్ధం చేసింది. న్యాయ శాఖ పరిశీలన అనంతరం దీన్ని గవర్నర్ ఆమోదం కోసం పంపనుంది. మంగళవారం ఆర్డినెన్స్ ముసాయిదా  గవర్నర్​కు చేరుతుందని అధికారం వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత గవర్నర్ ఆమోదంతో పంచాయతీరాజ్​ సవరణ చట్టం అమల్లోకి వస్తుంది. ఆ వెంటనే  స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ఖరారు కోసం.. ఇప్పటికే ఉభయసభలు ఆమోదించిన బిల్లు, కులగణన సర్వే ఎంపిరికల్ డేటా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇస్తుంది. రిజర్వేషన్ల ఖరారుకు హైకోర్టు పెట్టిన డెడ్ లైన్ దగ్గర పడుతుండటంతో వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నది. 

చట్టంలో చిన్న మార్పు కోసమే ఆర్డినెన్స్

బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ‘పంచాయతీ రాజ్ చట్టం 2018’ లో ప్రభుత్వం చిన్న సవరణ చేస్తున్నది. ఇందులోని 285(ఏ) సెక్షన్ లో ఉన్న ‘‘స్థానిక సంస్థల్లో 50 శాతం మించకుండా రిజర్వేషన్లు అమలవుతాయి’’ అనే వాక్యం తొలగించి, ‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలవుతాయి’’ అని చేర్చి, ఆర్డినెన్స్​ జారీ చేయనుంది.

వారం రోజుల్లో  డెడికేటెడ్​ కమిషన్​ రిపోర్ట్​

బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ ఈ నెల 10న రాష్ట్ర కేబినెట్​ నిర్ణయం తీసుకోవడంతో అందుకు తగ్గట్టు బీసీ డెడికేటెడ్ కమిషన్ బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసే పనిలో పడింది. గతంలో 23 శాతం బీసీ రిజర్వేషన్లతో ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చినప్పటికీ తాజాగా కేబినెట్​ నిర్ణయంతో దీనిని 42 శాతం పెంచుతున్నది.  

మండలం యూనిట్ గా సర్పంచ్​, ఎంపీటీసీ స్థానాలకు... 

జిల్లా యూనిట్​గా జెడ్పీటీసీ స్థానాలకు.. రాష్ట్రం యూనిట్​గా జెడ్పీ చైర్​పర్సన్​ స్థానాలను ఖరారు చేస్తున్నది. రిజర్వేషన్ల ప్రకారం ముందు ఎస్సీ, ఎస్టీలకు ఆయా చోట్ల జనాభా ఆధారంగా సీట్లు కేటాయించిన తర్వాత బీసీలకు రిజర్వ్​ చేస్తారు.  రాబోయే వారం, పది రోజుల్లో బీసీ డెడికేటెడ్​ కమిషన్ రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. ఆ నివేదిక సర్కారుకు అందగానే ఆ ప్రకారం ఎన్నికల కమిషన్​ నోటిఫికేషన్​జారీ చేసే అవకాశం ఉంది.  గతంలో చేసిన పంచాయతీరాజ్​చట్టానికి చిన్న సవరణే కావడం వల్ల ఆర్డినెన్స్​కు గవర్నర్ నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండదని ప్రభుత్వం భావిస్తున్నది. అలాగే ఆర్డినెన్స్​కు  వ్యతిరేకంగా ఎవరూ కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదని, జీవో లపైన మాత్రమే వెళ్లే అవకాశముంటుందని అంచనా వేస్తున్నది. 

ఈ అంశంపై న్యాయ నిపుణులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నది. వాస్తవానికి బీసీ రిజర్వేషన్ల అంశంలో రాష్ట్ర సర్కారు మొదటి నుంచీ ఆచితూచి ముందుకెళ్తున్నది. హైకోర్టు ఉత్తర్వులకు తగ్గట్టు బీసీ డెడికేటెడ్​ కమిషన్​ను ఏర్పాటుచేయడంతోపాటు రాష్ట్ర ప్రణాళికా విభాగం ఆధ్వర్యంలో కుల గణన చేపట్టింది. ఈ కుల గణన సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీలు 56.33 శాతం ఉన్నట్లు తేలింది. ఈ సర్వే ద్వారా బీసీల ఆర్థిక, సామాజిక స్థితిగతులను, రాజకీయ ప్రాతినిధ్యాన్ని లెక్కతీసింది. ఈ గణాంకాలు, ఎంపిరికల్​డాటా ఆధారంగా విద్య, ఉద్యోగాలు,  స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ చేసిన బిల్లులను మార్చి17న ఉభయసభలు ఆమోదించాయి. ఈ బిల్లులు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్​ఉన్నాయి. వీటిని రాష్ట్రపతితో ఆమోదింపజేసి, 9వ షెడ్యూల్​లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తిచేస్తున్నా.. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలోనే అడ్వకేట్ జనరల్, న్యాయ శాఖ సలహాలు, సూచనలకు తగ్గట్టు పంచాయతీరాజ్​చట్టానికి సవరణ తర్వాత నేరుగా జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని సర్కారు నిర్ణయించింది.