మెదక్ లో44, జహీరాబాద్​లో 19 నామినేషన్లు

మెదక్ లో44, జహీరాబాద్​లో 19 నామినేషన్లు
  •     మెదక్​లో మొత్తం54 నామినేషన్లు
  •      9 మంది విత్​డ్రా
  •     జహీరాబాద్ లో మొత్తం 40 నామినేషన్లు
  •     14 రిజెక్ట్, 7 విత్​డ్రా

మెదక్, సంగారెడ్డి, వెలుగు: నామినేషన్ల విత్ డ్రా అనంతరం మెదక్ లోక్ సభ నియోజకవర్గ స్థానంలో 44 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. మొత్తం54 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా అందులో ఒకటి రిజెక్ట్ అయ్యింది. అది పోను53 మంది అభ్యర్థులు ఉండగా వారిలో 9 మంది విత్ డ్రా చేసుకున్నారు. దీంతో 44 మంది బరిలో మిగిలారు. వారిలో గుర్తింపు పొందిన రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు 15 మంది కాగా 29 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు.

మొత్తం 44 మంది అభ్యర్థులు బరిలో ఉన్నపటికీ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య ట్రయాంగిల్ ఫైట్ జరుగనుంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు, బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు. కాగా రఘునందన్ రావు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం రెండోసారి కాగా, వెంకట్రామిరెడ్డి, నీలం మధు ఎంపీ పదవికి పోటీ చేయడం ఇదే మొదటిసారి. ఎన్నికల్లో గెలుపు కోసం  ప్రధాన రాజకీయ పార్టీలు మూడు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. 

జహీరాబాద్​ లోక్​సభ స్థానంలో..

జహీరాబాద్ నియోజకవర్గ స్థానంలో మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోటీలో ఉండేందుకు ఓవరాల్ గా 40 మంది అభ్యర్థులు 64 సెట్ల నామినేషన్ దాఖలు చేయగా అందులో14 మంది నామినేషన్లను వివిధ కారణాల వల్ల రిజెక్ట్ చేశారు. ఏడుగురు అభ్యర్థులు వారి నామినేషన్లను విత్​డ్రా చేసుకున్నారు. వీటికి సంబంధించిన సమగ్ర వివరాలను కలెక్టర్, రిటర్నింగ్ అధికారి క్రాంతి వల్లూరు మీడియాకు వెల్లడించారు. జహీరాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లో 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు తెలిపారు.

అందులో 9 మంది అభ్యర్థులు ప్రధాన పార్టీలతో పాటు ఇతర పార్టీల క్యాండిడేట్లుగా కాగా 10 మంది అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా పోటీలో ఉన్నారన్నారు. బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్, బీజేపీ నుంచి బీబీ పాటిల్, కాంగ్రెస్ నుంచి సురేశ్ షెట్కార్, తెలంగాణ ప్రజాశక్తి నుంచి కొత్త  బలిజ బసవరాజ్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గుర్రపు మశ్చేందర్, అల్లెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నుంచి చావగాని మనీ, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మల్లెపు మోహన్ రెడ్డి, ఇండియా ప్రజాబంధు నుంచి రోమల బాబు దుర్గయ్య పోటీలో ఉన్నారన్నారు.

అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా అశోక్ తలారి, కమ్మరి ఆనందేశ్వర్, జైపాల్ నాయక్, మహమ్మద్ సద్దాం, మారుతీ రావు, రమేశ్ సజ్జిపూర్, ఎస్ రాజు, కొవూరి సత్యనారాయణ గౌడ్ బరిలో నిలిచినట్టు రిటర్నింగ్ అధికారి క్రాంతి తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి పాల్గొన్నారు.