రికార్డు స్థాయిలో యూరియా అమ్మకాలు.. మూడు నెలల్లో 12 వేల టన్నుల ఎరువులు పంపిణీ

రికార్డు స్థాయిలో యూరియా అమ్మకాలు.. మూడు నెలల్లో 12 వేల టన్నుల ఎరువులు పంపిణీ
  • జిల్లాలో 4.50 లక్షల ఎకరాల పంట సాగు 
  • రైతులను భయపెడుతున్న కొత్త యాప్​

నాగర్​కర్నూల్, వెలుగు : యాసంగి సాగుకు రైతులు పొలాలు దున్నడం, నారుమళ్లు పోయడం వంటి పనులు ప్రారంభించారు.ముఖ్యంగా వరి, వేరుశనగ, మొక్కజొన్న వంటి పంటలపై దృష్టి సారిస్తున్నారు. కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల్లో యాసంగి దుక్కులు మొదలు పెట్టకపోయినా జిల్లాలో రికార్డు స్థాయిలో దాదాపు14 వేల టన్నుల యూరియా అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. గతేడాది యాసంగిలో మొక్కజొన్న, వరి, వేరుశనగ పంటకు 9,632 టన్నుల యూరియా సప్లై చేసిన వ్యవసాయశాఖ అధికారులు.. ఈ సీజన్​లో మూడు నెలల్లో దాదాపు 13,528 వేల టన్నుల యూరియా పంపిణీ చేశారు. మరో1800 టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు సమాచారం. 

4.50 లక్షల ఎకరాల్లో పంట సాగు..

ఈ సీజన్​లో జిల్లాలో 4.50 లక్షల ఎకరాల పంట సాగు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో 1.20 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, లక్ష ఎకరాల్లో వేరుశనగ, 1.80 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయనున్నారు. మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరగడంతో యూరియాకు డిమాండ్​పెరుగుతోంది. వరి పంట సాగులో ఎకరాకు మూడు బస్తాల యూరియా అవసరమైతే.. మొక్కజొన్న పంటకు 7 బస్తాల వరకు వినియోగిస్తారు.  

కొత్త యాప్ భయం..

గత వానాకాలంలో షార్టేజ్​తో సింగిల్ విండోలు, ఆగ్రో సెంటర్ల ముందు లైన్ కట్టిన రైతులు.. ఈసారి అదే పరిస్థితి వస్తుందేమోననే భయంతో అడ్వాన్స్​గా యూరియా కొనడానికి ఎగబడుతున్నారు. యూరియాను యాప్ ద్వారా బుక్ చేసుకోవాలనే నిబంధన రైతులను మరింత గందరగోళానికి గురిచేస్తోంది. జిల్లాకు సప్లై అవుతున్న యూరియాలో 65 శాతం సింగిల్​విండోలు, హాకా, ఆగ్రో సెంటర్లకు కేటాయిస్తే.. మిగతా 35 శాతం ప్రైవేట్ డీలర్లకు ఇస్తున్నారు.

విత్తనాలు, ఎరువులు అప్పు కింద తెచ్చుకునే రైతులు బస్తాకు రూ.10 ఎక్కువగా చెల్లించి ప్రైవేట్ డీలర్ల దగ్గర కొంటున్నారు. రైతులకు కావాల్సినంత యూరియా అందుబాటులో ఉందని, ఎవరూ ఆందోళన చెందవద్దని అధికారులు చెబుతున్నారు.