
- ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టులో 4.8 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి
- రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి
న్యూఢిల్లీ: ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టులో శనివారం చరిత్రాత్మక మైలురాయి సాధించామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో 4.8 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని పూర్తి చేశామని ఆయన చెప్పారు. ముంబై సబర్బన్ లోని ఘన్ సోలీ, ఠాణేలోని శిల్ఫాటాలో ఒకేసారి టన్నెల్ తవ్వకం ప్రారంభమైందని, టన్నెల్ ను ఇంజినీర్లు, వర్కర్లు పూర్తిచేశారని, ఇరువైపులా బృందాలు కనెక్ట్ అయ్యాయని వెల్లడించారు.
నీటి లోపలి భూభాగంలోనూ సొరంగ మార్గాన్ని నిర్మించామని పేర్కొన్నారు. ఇదొక అద్భుతమైన ఇంజినీరింగ్ ఫీట్ అన్నారు. టన్నెల్ ను పూర్తిచేసిన బృందానికి మంత్రి అభినందనలు తెలిపారు. ‘‘ఈ బుల్లెట్ ట్రైన్ తో ముంబై–అహ్మదాబాద్ మధ్య ప్రయాణ సమయం 2 గంటల 7 నిమిషాల్లోనే పూర్తవుతుంది. అలాగే, ప్రధాన కమర్షియల్ సెంటర్లను కూడా ఈ రైలు మార్గం కలుపుతుంది.
జపాన్ లోని ప్రపంచపు మొదటి బుల్లెట్ ట్రైన్ టోక్యో, నగోయా, ఒసాకాను కలిపి జపాన్ ఆర్థిక వృద్ధికి దోహనం చేసినట్లు ఈ బుల్లెట్ రైలు కూడా ఆనంద్, అహ్మదాబాద్, వడోదర, సూరత్, వాపి, ముంబైను కలిపి సింగిల్ ఎకనామిక్ కారిడార్ గా మారుస్తుంది. దీంతో ఈ కారిడార్ లో పారిశ్రామిక వృద్ధి జరిగి ఉపాధి అవకాశాలు దొరకుతాయి” అని మంత్రి పేర్కొన్నారు. మిడిల్ క్లాస్ వారికీ టికెట్ రేట్లు అందుబాటులో ఉంటాయని, వారిని కూడా దృష్టిలో ఉంచుకున్నామని మంత్రి వెల్లడించారు.