దేశ వ్యాప్తంగా 49 ప్రైవేటు ల్యాబ్స్ లో క‌రోనా టెస్టులు

దేశ వ్యాప్తంగా 49 ప్రైవేటు ల్యాబ్స్ లో క‌రోనా టెస్టులు
  • క‌రోనా వ్యాక్సిన్ కోసం ఈ సంస్థ‌ల‌తో క‌లిసి కృషి

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా వైర‌స్ కు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ క‌నుక్కొనే ప్ర‌య‌త్నాలు వేగంగా సాగుతున్నాయ‌ని చెప్పారు ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సైంటిస్ట్ రామ‌న్ గంగ‌ఖేద్క‌ర్. మంగ‌ళ‌వారం నాడు కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. కరోనా మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు అవ‌స‌ర‌మైన వ్యాక్సిన్ క‌నిపెట్టేందుకు దేశంలోని ప‌లు అత్యున్న‌త ప‌రిశోధ‌న సంస్థ‌ల‌తో క‌లిసి ప‌ని చేస్తున్నామ‌ని చెప్పారాయ‌న‌. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండ‌స్ట్రీయ‌ల్ రీసెర్స్, డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ, డిపార్ట్ మెంట్ ఆఫ్ బ‌యోటెక్నాల‌జీ వంటి సంస్థ‌లతో క‌లిసి ప్ర‌యోగాల‌కు సంబంధించిన భవిష్య‌త్తు ఎజెండాను ఐసీఎంఆర్ రూపొందిస్తుంద‌ని తెలిపారు రామ‌న్.

42,788 టెస్టులు

క‌రోనా ప‌రీక్ష‌ల కోసం దేశ వ్యాప్తంగా 123 ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయ‌ని చెప్పారు రామ‌న్. 49 ప్రైవేటు ల్యాబ్స్ కి కూడా అనుమ‌తి ఇచ్చిన‌ట్లు తెలిపారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 42,788 శాంపిల్స్ ప‌రీక్షించిన‌ట్లు ఆయ‌న‌ తెలిపారు. నిన్న (సోమ‌వారం) ఒక్క రోజే 4,346 టెస్టులు చేశామ‌న్నారు. మ‌న‌కు ఉన్న లాబ్స్ సామ‌ర్థ్యంలో ఇది కేవ‌లం 36 శాతం మాత్ర‌మేన‌ని చెప్పారు రామ‌న్. దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చిన 49 ప్రైవేటు ల్యాబ్స్ లో నిన్న ఒక్క రోజే క‌రోనా ఉంద‌న్న అనుమానం వ‌చ్చిన 399 మంది ప‌రీక్ష‌లు చేయించుకున్నార‌ని తెలిపారు.