తూకం వేసిన 48 గంటల్లో డబ్బులు జమ..మెదక్ మెదక్జిల్లా వ్యాప్తంగా 498 వడ్ల కొనుగోలు కేంద్రాలు : సామల జగదీశ్ కుమార్

తూకం వేసిన 48 గంటల్లో డబ్బులు జమ..మెదక్ మెదక్జిల్లా వ్యాప్తంగా 498 వడ్ల కొనుగోలు కేంద్రాలు  : సామల జగదీశ్ కుమార్
  • 'వెలుగు'తో సివిల్​ సప్లై డీఎం సామల జగదీశ్​ కుమార్​ 

మెదక్, వెలుగు: జిల్లాలో వడ్ల కొనుగోలుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు సివిల్ సప్లై జిల్లా మేనేజర్ సామల జగదీశ్​కుమార్​తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరిగేలా చూడటంతోపాటు.. తూకం వేసిన 48 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేస్తామనితెలిపారు. వానాకాలం సీజన్​ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై ఆయన 'వెలుగు'తో ప్రత్యేకంగా మాట్లాడారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాల నిర్వహణ తీరు ఆయన మాటల్లోనే..  ఈ సీజన్​లో కొనుగోలు కేంద్రాలకు 3.23 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశాం. 

ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా పీఏసీఎస్, ఐకేపీ, ఏఎంసీ, ఎఫ్​పీఓల ఆధ్వర్యంలో మొత్తం 498 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇందులో సన్న వడ్ల కోసం ప్రత్యేకంగా 100 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. మిగిలిన 398 కేంద్రాల్లో దొడ్డు వడ్లకొనుగోలు జరుగుతుంది. జిల్లాలో మొత్తం 98 రైస్​ మిల్లులు ఉన్నాయి. ఇప్పటి వరకు 35 రైస్​ మిల్లర్లు బ్యాంక్​ గ్యారెంటీ ఇచ్చారు. బ్యాంక్​ గ్యారెంటీ ఇచ్చిన వారికే ధాన్యం కేటాయిస్తాం.

200 ప్యాడీ క్లీనర్లు రానున్నాయి

 జిల్లాలో ఒక కోటి గన్నీ బ్యాగులు అవసరం కాగా.. ప్రస్తుతం 50 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. మరో 50 లక్షల గన్నీ బ్యాగులు తెప్పిస్తున్నాం. వర్షాలు పడే అవకాశం ఉండడంతో ధాన్యం తడిసి పోకుండా ఉండేందుకు ఒక్కో కొనుగోలు కేంద్రానికి 40 టార్ఫాలిన్​ లు ఇవ్వాలని నిర్ణయించాం. ప్రస్తుతం జిల్లాలో 20 వేల టార్ఫాలిన్​ లు అందుబాటులో ఉన్నాయి. మరో 7 వేల టార్ఫాలిన్​ లకోసం ఇండెంట్​ పెట్టాం. ప్రస్తుతం 6 ఆటోమెటిక్​ ప్యాడీ క్లీనర్​ లు రెడీగా ఉన్నాయి. మరో 200 ప్యాడీ క్లీనర్​ లకోసం ఇండెంట్​ పెట్టాం. పది పదిహేను రోజుల్లో అవి చేరుకుంటాయి. మనుషుల అవసరం లేకుండానే ఆటోమెటిక్​ ప్యాడీ క్లీనర్​ ల ద్వారా ఈజీగా ధాన్యం శుభ్రం చేసుకోవచ్చు. అలాగే మెదక్, రామాయంపేట వ్యవసాయ మార్కెట్​ యార్డుల్లో డ్రయర్​లు అందుబాటులో ఉన్నాయి. 

బిహార్ ఎన్నికలున్నందున ఒడిశా నుంచి హమాలీలు

 తూకం వేసిన ధాన్యాన్ని రైస్​ మిల్లులకు తరలించేందుకు ఆర్టీఏ అధికారుల సహకారంతో 600 లారీలు సమకూర్చుతున్నాం. ఏ ఏ సెంటర్​ నుంచి ఎంత మేర ధాన్యం వస్తుందో దానికి అనుగుణంగా అవసరమైన మేరకు లారీలను పంపించే ఏర్పాటు చేస్తాం. జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 70 కొనుగోలు కేంద్రాలకు హమాలీలు వచ్చారు. బిహార్​ లో ఎన్నికలు జరుగుతున్నందున అక్కడ పోలింగ్ ముగిశాక కూలీలు వచ్చే అవకాశం ఉంది. 

అప్పటివరకు ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి హమాలీలను రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వానాకాలం సీజన్​లో రైస్ మిల్లులు ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంటాయి కాబట్టి, ధాన్యం నిల్వ చేసేందుకు ఇబ్బంది ఉండదు. ముందు జాగ్రత్తగా రామాయంపేట, చేగుంట, మాసాయిపేటలో 10 వేల మెట్రిక్​ టన్నుల నిల్వ సామర్ధ్యం గత గోడౌన్​ లు రెడీగా ఉంచుతున్నాం.