ముంబైలో కూలే దశలో మరో 499 భవంతులు

ముంబైలో కూలే దశలో మరో 499 భవంతులు
  • డోంగ్రీ.. అక్రమ నిర్మాణాలకు అడ్డా
  • లంచాల మత్తులో అధికారులు
  • ప్రాణాలను పణంగా పెడుతున్న జనం

ముంబై: ఇరుకిరుకు ఇండ్లు.. పేకమేడల్లా వెలిసిన భవంతులు.. కొన్ని స్వాతంత్య్రానికి పూర్వమే కట్టినవి.. జనంతో కిక్కిరిసిపోయి ఉండే ఆ భవంతుల్లో చాలావరకూ అక్రమ నిర్మాణాలే! లంచాల మత్తులో అధికారులు.. మరోవైపు కూలిపోతాయని తెలిసినా.. పట్టించుకోని జనం! ముంబైలో మంగళవారం వందేళ్ల భవనం పేకమేడలా కూలిపోయి 14 మంది బతుకులను హరించివేసిన సంఘటనకు ఇవే  కారణాలు కావడం అసలు విషాదం. దక్షిణ ముంబైలోని డోంగ్రీ ఎన్‌‌క్లేవ్‌‌ ప్రాంతంలో కూలిపోయిన వందేళ్ల నాటి కేసరిబాయి బిల్డింగ్‌‌ లాంటివి ముంబై నగరంలో మరో 499 భవంతులు ఉన్నాయని అధికారుల అంచనా.

ముఖ్యంగా డోంగ్రీ ఏరియా అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారిపోయింది. ఇక్కడ 2.84 చ.కి.మీ. విస్తీర్ణంలోనే 1.28 లక్షల మంది నివసిస్తున్నారు. ఇండ్లన్నీ దాదాపుగా ఒకదానికొకటి సందు లేకుండా ఉంటాయి. జనం రద్దీ మాత్రమే కాదు.. వాహనాలతో రోడ్లన్నీ స్తంభించిపోతాయి. ఏదైనా ప్రమాదం జరిగితే.. ఫైర్‌‌ ఇంజన్లు, సహాయక సిబ్బంది చేరుకోవడమూ కష్టమవుతోంది. ఇండ్లకు మరమ్మతుల పేరుతో ఇక్కడివారు యథేచ్ఛగా అంతస్తులపై అంతస్తులు కడుతున్నారు. పక్కన కొంచెం కూడా ఖాళీ జాగా లేకుండా కట్టేస్తున్నారు. బీఎంసీ అధికారులకు లంచమిస్తే చాలు..ఎలాగైనా కట్టుకోవచ్చు అన్న పరిస్థితి ఉండటంతో ఎవరికి వారు తమ స్వార్థం చూసుకుంటున్నారు. కేసరిబాయి బిల్డింగ్‌‌ కూలిపోయే ప్రమాదముందని, వెంటనే ఖాళీ చేయాలంటూ బీఎంసీ అధికారులు 2017 ఆగస్టులోనే హెచ్చరించారు. దీనిని సీ1 (ప్రమాదకరం/నివాసయోగ్యం కానిది/కూల్చివేయవలసినది) కేటగిరీలో చేర్చుతూ నోటీసులు ఇచ్చారు. కానీ, బిల్డింగ్‌‌ కూల్చి కొత్తది కట్టేలోపు తమ స్థలం ఎవరు కబ్జా చేస్తారో తెలియని పరిస్థితి, ఖర్చు భారీగా కావడం వంటి కారణాలతో యజమానులు ముందుకు రావడం లేదు. ప్రజలు కూడా కాస్త చౌకగా ఇండ్లు దొరుకుతాయన్న ఆశతో అలాగే నివసిస్తున్నారు.

అయితే, దేశంలోనే అత్యంత సంపన్నమైన పురపాలక సంస్థ అయిన బీఎంసీ అగ్నిమాపక, డిజాస్టర్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ సేవలకు మాత్రం పెద్దగా నిధులు ఖర్చు చేయటం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి సంఘటనలు తరచూ జరగుతున్నాయి. నేషనల్‌‌ క్రైమ్‌‌ రికార్డ్స్‌‌ బ్యూరో స్టాటిస్టిక్స్‌‌ ప్రకారం, ప్రతి రోజూ ఐదుగురు బలి అయిపోతున్నారు. మంగళవారం కేసరిబాయి భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 14కు పెరిగింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం బుధవారం కూడా సహాయక చర్యలు కొనసాగాయి.