గేమింగ్ జోన్ అగ్నిప్రమాదంలో 33కు చేరిన మృతుల సంఖ్య

గేమింగ్ జోన్ అగ్నిప్రమాదంలో 33కు చేరిన మృతుల సంఖ్య
  • చనిపోయిన వారిలో9 మంది పిల్లలు
  • ఘటనను సుమోటోగా తీసుకున్న గుజరాత్  హైకోర్టు

రాజ్ కోట్: గుజరాత్  రాష్ట్రం రాజ్ కోట్ లోని టీఆర్ పీ గేమింగ్ జోన్ లో సంభవించిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 33కు చేరింది. వారిలో 9 మంది పిల్లలు ఉన్నారు. అగ్ని ప్రమాదం ఘటనను గుజరాత్  హైకోర్టు సుమోటోగా తీసుకుంది. మరోవైపు ఈ ఘటనలో ఆరుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్  నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితుల్లో రేస్ వే ఎంటర్ ప్రైజెస్  (టీఆర్ పీ గేమ్ జోన్  ఈ సంస్థే నిర్వహిస్తోంది) పార్ట్ నర్  యువరాజ్  సింగ్  సోలంకి, గేమింగ్  జోన్  మేనేజర్  నితిన్  జైన్  ఉన్నారు. 

మిగిలిన నిందితులను కూడా అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టామని రాజ్ కోట్  పోలీస్  కమిషనర్  మహేష్  వెల్లడించారు. గుజరాత్  సీఎం భూపేంద్ర పటేల్, రాష్ట్ర హోం మంత్రి హర్ష్  సంఘవి.. ప్రమాదంపై ఆదివారం సమీక్ష నిర్వహించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఈ ఘటనపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కూడా.. రాజ్ కోట్ లో స్థానిక యంత్రాంగంతో భేటీ నిర్వహించింది. కాగా.. ప్రమాదంలో చనిపోయిన వారి డెడ్ బాడీలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని అధికారులు తెలిపారు. మృతుల గుర్తింపు కోసం మృతదేహాలు, వారి బంధువుల డీఎన్ఏ  నమూనాలను సేకరించామని చెప్పారు.

రూల్స్ బ్రేక్  చేసి నిర్మాణం

గేమింగ్  జోన్  నిర్మాణంలో నిందితులు రూల్స్  బ్రేక్  చేశారని పోలీసులు ఎఫ్ఐఆర్ లో తెలిపారు. ‘‘గేమింగ్  జోన్ ను నిర్మించడానికి రెండు నుంచి మూడు అంతస్తుల ఎత్తుతో 50 మీటర్ల వెడల్పు, 60 మీటర్ల పొడవుతో నిందితులు ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేయించారు. అందులో సరైన ఫైర్  ఫైటింగ్  సదుపాయాలు లేవు. ఫైర్  డిపార్ట్ మెంట్  నుంచి నిందితులు ‘నో అబ్జెక్షన్  సర్టిఫికెట్’ కూడా పొందలేదు. 

ఇలాంటి పరిస్థితిలో అగ్నిప్రమాదం సంభవిస్తే.. చాలా మంది మరణించడంతో పాటు గాయపడతారని తెలిసి కూడా నిందితులు సరైన రక్షణ పద్ధతులను అవలంబించలేదు” అని పోలీసులు వివరించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. గేమింగ్  జోన్ లో అగ్ని ప్రమాదం నేపథ్యంలో రాజ్ కోట్ లోని అన్ని గేమింగ్  జోన్లనూ మూసివేయాలని వాటి యజమానులకు ఆదేశాలు జారీచేశారు. అలాగే ఆ గేమింగ్  జోన్లను పరిశీలించాలని పోలీసు కమిషనర్లకు డీజీపీ ఆదేశాలు ఇచ్చారు.