పాట్నా: బీహార్ లో క్రమంగా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. బీహార్ మిలటరీ పోలీస్(బీఎమ్పీ) సిబ్బంది ఐదుగురికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో ఐదుగురు బీఎమ్పీ సిబ్బందితో సహా రాష్ట్రంలో కొత్తగా 29 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అక్కడి వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 579 కి పెరిగింది. ఇందులో ఎక్కువ కేసులు పాట్నాలోని ఖాజాపుర ప్రాంతానికి చెందినవేనని ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ ట్వీట్ చేశారు. కరోనా కన్ఫామ్ అయిన ఒక జవాను ఈ మధ్యే రిటైర్ అయ్యారు. ఆయనతో కాంటాక్టు కావడంతోనే ప్రస్తుతం ఐదుగురు జవాన్లకు కరోనా సోకినట్లు గుర్తించారు. ఇప్పటివరకు ఐదుగురు వైరస్ పేషెంట్లు చనిపోగా.. 267 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
