ప్రముఖ కన్నడ నవలా రచయిత్రి, ప్రచురణకర్త, కళాకారిణి ఆశా రఘు (47) కన్నుమూశారు. బెంగళూరులోని మల్లేశ్వరంలో ఆమె ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త మరణం తర్వాత ఒంటరితనం, మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఆశా రఘు భర్త కె.సి. రఘు ప్రముఖ డైటీషియన్ & రచయిత. ఆయన రెండేళ్ల క్రితం లంగ్స్ క్యాన్సర్‌తో మరణించారు. అప్పటి నుండి ఆశా మానసిక ఒత్తిడికి గురైంది. వీరికి ఒక కుమార్తె ఉంది. నిన్న రాత్రి ఆమె తన గదిలో ఆత్మహత్య చేసుకోగా, కుటుంబికులు గమనించి రక్షించే లోపే చనిపోయారు.
సోషల్ మీడియా పోస్ట్:
ఆమె మరణానికి 10 రోజుల ముందు ఫేస్‌బుక్‌లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు అందరినీ కదిలిస్తుంది. ఆ పోస్ట్‌లో తన కలలోకి చనిపోయిన తల్లిదండ్రులు, భర్త వచ్చారని, కలలో నా భర్త నా జుట్టును నిమురుతూ ఫ్రాన్స్‌కు వెళ్తున్నానని చెప్పారు. నేను మేల్కొన్న తర్వాత వారి ఫోటో చూసి చాలా ఏడ్చాను. నేను కూడా ఫ్రాన్స్‌కు వెళ్తే వారు నాకు కనిపిస్తారేమో అనిపిస్తోంది అని ఆమె పోస్టులో బాధను వ్యక్తం చేశారు. ఆ బాధతోనే ఆమె ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని భావిస్తున్నారు. ఆశా రఘు భర్త మరణం తర్వాత డిప్రెషన్‌లో ఉందని పోలీసులు తెలిపారు. ఆమె మరణాన్ని అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఆశా రఘు గురించి:
ఆమె 18 జూన్ 1979న బెంగళూరులో జన్మించారు. కన్నడలో పీజీ చేసి, కొంతకాలం లెక్చరర్‌గా పనిచేశారు. ఆ తర్వాత నాటకాలు, టీవీ ఇంకా సినిమాల్లో సహాయ దర్శకురాలిగా, డైలాగ్ రైటర్ గా రాణించారు.'ఉపాసన' అనే సంస్థను ప్రారంభించి ఎంతో మంది యువ రచయితల పుస్తకాలను పబ్లిషింగ్ చేసారు. ఆమె కన్నడలో ఎన్నో అద్భుతమైన నవలలు, కథలు రాశారు. ఆమె ప్రతిభకు చాల అవార్డులు కూడా వచ్చాయి. కర్ణాటక సాహిత్య అకాడమీ అవార్డు (2014), కన్నడ సాహిత్య పరిషత్ అవార్డు (2019), 2023లో మాండ్య జిల్లా సాహిత్య పరిషత్ నుండి 'సాహిత్యామృత సరస్వతి' అనే బిరుదును అందుకున్నారు.
