అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. పోలీసు అధికారితో సహా ఐదుగురు మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. పోలీసు అధికారితో సహా ఐదుగురు మృతి

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. న్యూయార్క్ నగరం మాన్‌హట్టన్‌లోని ఓ భారీ భవనంలో దుండగుడు విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు మృతి చెందారు. మరికొందరు బుల్లెట్ గాయాలకు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నిందితుడితో పాటు ఓ పోలీస్ అధికారి ఉన్నాడని అధికారులు వెల్లడించారు. దుండగుడిని 27 ఏళ్ల షేన్ తుమురాగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. 

కాగా, సోమవారం (జూలై 28) సాయంత్రం బ్లాక్‌స్టోన్, కేపీఎంజీ, డ్యూయిష్ బ్యాంక్ వంటి అగ్రశ్రేణి కంపెనీలతో పాటు ఎన్ఎఫ్ఎల్ (నేషనల్ ఫుట్‌బాల్ లీగ్) ప్రధాన కార్యాలయం ఉన్న మాన్‌హట్టన్‌లోని పార్క్ అవెన్యూ టవర్‎లోకి చొరబడ్డ దుండగుడు ఓపెన్ ఫైరింగ్ చేశాడు. ఈ కాల్పుల్లో ఓ పోలీస్ అధికారితో పాటు నలుగురు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న పార్క్ అవెన్యూ భవనం బుల్లెట్ల మోతతో దద్దరిల్లిపోయింది. ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రజలు భయంతో పరుగులు తీశారు. 

సమాచారం అందుకున్న న్యూయార్క్ పోలీసులు, భద్రతా దళాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నాయి. పోలీసులు రాకను గమనించిన దుండగుడు తనను తాను కాల్చుకుని చనిపోయాడు. ఘటన స్థలాన్ని భద్రతా దళాలు పూర్తిగా అదుపులోకి తీసుకుని పరిస్థితిని కంట్రోల్‎లోకి తెచ్చాయి. నిందితుడిని నెవాడాకు చెందిన షేన్ తమురాగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని.. కాల్పుల వెనక మోటివ్ ఏంటనే దానిపై ఆరా తీస్తున్నామని తెలిపారు. 

ప్రముఖ కంపెనీ కార్యాలయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన మాన్‎హట్టన్ పార్క్ అవెన్యూ టవర్లో కాల్పుల ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిందితుడి తుపాకీ పట్టుకుని భవనంలోకి రావడం, కాల్పులు జరపడం, ప్రజలు భయంతో పరుగులు పెట్టిన విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. 

ఈ ఘటనపై న్యూయార్క్ పోలీస్ కమిషనర్ జెస్సికా డిస్చ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రస్తుతానికి సంఘటన స్థలంలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని.. కాల్పులకు పాల్పడ్డ నిందితుడిని న్యూట్రలైజ్ చేసినట్లు తెలిపారు. కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి కూడా చనిపోయాడని.. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు.