
న్యూఢిల్లీ: ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ నాయకత్వంలో లక్నోలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ కొన్ని వస్తువులపై వసూలు చేస్తున్న జీఎస్టీ రేట్లను మార్చింది. ఇక నుంచి స్విగ్గి, జొమాటోలు ఫుడ్ డెలివరీలపైనా ఐదుశాతం జీఎస్టీ విధిస్తారు. ఫలితంగా రెస్టారెంట్ల నుంచి తెప్పించుకునే ఆహారం మరింత ఖరీదు అవుతుంది. కరోనా మందులపై జీఎస్టీ రేట్లను తగ్గించామని, కొన్నింటిపై పూర్తిగా ఎత్తేశామని మంత్రి నిర్మల ప్రకటించారు. జోల్గెన్‌స్మా, విల్టేప్సో వంటి కరోనా మెడిసిన్స్‌పై జీఎస్టీని ఎత్తేశారు. వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నా సుంకం వసూలు చేయరు. కార్బొనేటెడ్ ఫ్రూట్ డ్రింక్స్ పై జీఎస్టీని 12 శాతం నుంచి 28 శాతానికి పెంచారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు సరఫరా చేసే బయోడీజిల్‌పై పన్నును 12 శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు. ‘హెడింగ్ 3006’ లిస్టులోని అన్ని ఫార్మా ప్రొడక్టులపై ఇక నుంచి 12 శాతం జీఎస్టీ ఉంటుంది. ఐస్‌క్రీమ్ పార్లర్లు అమ్మే ఐస్‌క్రీమ్‌పై 18 శాతం జీఎస్టీ చెల్లించాలి. ఇనుము, మాంగనీస్, రాగి, నికెల్, కోబాల్ట్, అల్యూమినియం, సీసం, జింక్, టిన్, క్రోమియం, ఇతర లోహాలపై జీఎస్టీని ఐదుశాతం నుంచి 12 శాతానికి పెంచారు.