- పూర్తిగా కాలిన డెడ్ బాడీలు.. డీఎన్ఏ టెస్టులతో గుర్తింపు
- కేరళ వాసులు 24 మంది, తమిళులు ఐదుగురు
- గుర్తుపట్టలేనంతగా కాలిన డెడ్ బాడీలు
- డీఎన్ఏ టెస్టులతో గుర్తించిన కువైట్ అధికారులు
- డెడ్ బాడీలను ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లు
న్యూఢిల్లీ/కువైట్ సిటీ: కువైట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయినవాళ్లలో 45 మంది ఇండియన్స్ ఉన్నట్టుగా నిర్ధారించారు. ఈ ప్రమాదంలో మొత్తం 49 మంది మృతిచెందగా.. మరో 50 మంది గాయపడ్డారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో డీఎన్ఏ టెస్టులు చేస్తున్నారు. ‘‘ఇప్పటి వరకు 48 డెడ్ బాడీలను గుర్తించాం. వారిలో 45 మంది ఇండియన్స్. మరో ముగ్గురు ఫిలిప్పీన్స్ కు చెందినవారు. ఇంకో డెడ్ బాడీని గుర్తించాల్సి ఉంది” అని కువైట్ ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ షేక్ ఫహద్ అల్ యూసుఫ్ అల్ సబా గురువారం తెలిపారు. కాగా, సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు మన దేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ కువైట్ వెళ్లారు. ఆయన గురువారం అక్కడి లీడర్లతో సమావేశమయ్యారు. డెడ్ బాడీలను ఇండియాకు తరలించేందుకు సహకరించాలని కోరారు. మరోవైపు డెడ్ బాడీలను ఇండియాకు తీసుకొచ్చేందుకు ఎయిర్ ఫోర్స్ విమానాన్ని కువైట్ కు పంపామని, శుక్రవారం డెడ్ బాడీలను తీసుకొచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
కువైట్ కు కేరళ మంత్రి..
కువైట్ లోని ఓ బిల్డింగ్ లో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 24 మంది కేరళ వాసులు చనిపోయారని రాష్ట్ర అధికారులు తెలిపారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయని, వాళ్లు ఆస్పత్రుల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని చెప్పారు. నాన్ రెసిడెంట్ కేరళైటిస్ అఫైర్స్ డిపార్ట్ మెంట్ సీఈవో అజిత్ కొలస్సేరి గురువారం మీడియాతో మాట్లాడారు. కువైట్ లోని ఇండియన్ ఎంబసీ అధికారులతో టచ్ లో ఉన్నామని చెప్పారు. విదేశాంగ శాఖ నుంచి సమాచారం వచ్చిన తర్వాత మృతుల వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. మరోవైపు కేరళ కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. సీఎం పినరయి విజయన్ నేతృత్వంలో మీటింగ్ జరిగింది. కువైట్ లో చనిపోయినోళ్ల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడినోళ్లకు రూ.లక్ష చొప్పున పరిహారం ఇస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
టాటూతో కొడుకు డెడ్ బాడీ గుర్తింపు..
కువైట్ లో కేరళకు చెందిన తండ్రీకొడుకులు ఒకే కంపెనీలో పని చేస్తున్నారు. ఈ ప్రమాదంలో కొడుకు చనిపోగా, టాటూ ఆధారంగా డెడ్ బాడీని తండ్రి గుర్తించాడు. ప్రదీప్, ఆయన కొడుకు శ్రీహరి కొన్నేండ్లుగా కువైట్ లో పని చేస్తున్నారు. వెకేషన్ పై కేరళకు వచ్చిన శ్రీహరి.. ఈ నెల 5వ తేదీనే తిరిగి కువైట్ వెళ్లాడు. కానీ దురదృష్టవశాత్తు అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.