కరోనా ఎఫెక్ట్: పేదలకు మరోసారి కేంద్ర సాయం..

కరోనా ఎఫెక్ట్: పేదలకు మరోసారి కేంద్ర సాయం..

కరోనా విజృంభణను అరికట్టడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రేషన్ కార్డున్న ప్రతి ఒక్కరికి ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన ఫేజ్-3 కింద అదనంగా 5 కేజీల చొప్పున ఆహార ధాన్యాలను ఉచితంగా అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ ఆహారధాన్యాలను మే, జూన్ నెలల్లో పంపిణీ చేయాలని ఆదేశించారు. కేటాయింపుల దామాషా ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గోధుమలు, బియ్యం కేటాయింపు చేపట్టాలని కేబినెట్‌లో నిర్ణయించారు. రాష్ట్రాల్లో అమలవుతున్న లాక్‌డౌన్ పరిస్థితులు, తుపానులు, భారీ వర్షాలు, ఆహార సరఫరాలు, కోవిడ్ సంబంధిత ఆంక్షలు వంటివాటిని దృష్టిలో ఉంచుకుని ఈ ఉచిత పంపిణీని చేయనున్నట్లు కేబినెట్ తెలిపింది. ఈ ఉచిత పంపిణీ వల్ల సుమారు 79.88 కోట్ల మందికి నెలకు ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున రెండు నెలలపాటు ఆహారధాన్యాల పంపిణీకి సుమారు రూ.25,332.92 కోట్లు అవుతుందని కేబినెట్ అంచనా వేసింది. కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన ఆర్థిక ఇబ్బందుల వల్ల పేదల కష్టాలను తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని మోడీ తెలిపారు. అదేవిధంగా పీఎం-కేర్స్ నిధులతో న్యూఢిల్లీలోని ఎయిమ్స్, ఆర్ఎంఎల్ ఆసుపత్రుల్లో రెండు హై ఫ్లో మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.