పరీక్ష జరిగి 5 నెలలు.. రిజల్ట్స్​ ఎప్పుడు?

పరీక్ష జరిగి 5 నెలలు.. రిజల్ట్స్​ ఎప్పుడు?

సింగరేణి మెనేజిమెంట్ ట్రైనీ పరీక్షల్లో అక్రమాలు
బోగస్ కాండిడేట్లు, మాస్ కాపీయింగ్ పై విచారణ

మందమర్రి,వెలుగుజాబ్​ సెలెక్షన్ కోసం పరీక్షలు పెట్టిన ప్రతిసారి సింగరేణి అభాసుపాలవుతోంది. సింగరేణి ఎలక్ర్టికల్​, మెకానికల్​ విభాగంలో మేనేజ్​మెంట్​ ట్రైనీ పోస్టులను భర్తీ చేసేందుకు పెట్టిన ఎగ్జామ్స్ లో అక్రమాలు వెలుగుచూశాయి. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడం, హైటెక్ ​కాపీయింగ్​జరగడంతో రిజల్ట్స్​ నిలిపివేశారు. స్కాంతో సంబంధం ఉన్న సింగరేణి ఉన్నతాధికారులను కేసు నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో అసలు రిజల్ట్స్​ ప్రకటిస్తారా, లేదా పరీక్షను రద్దు చేస్తారా అని పరీక్షలు రాసిన 8 వేల మంది కాండిడేట్లు ఆందోళన చెందుతున్నారు.

మూడేండ్ల కింద నోటిఫికేషన్​

సింగరేణిలో 68 మేనేజ్​మెంట్​ ట్రైనీ పోస్టులను భర్తీ చేసేందుకు 2017 మేలో నోటిఫికేషన్​ జారీ చేశారు.  22,221 మంది అప్లికేషన్​ చేసుకున్నారు. నోటిఫికేషన్​ ఇచ్చిన మూడేండ్ల తర్వాత 2020 మార్చి 1న రాత పరీక్ష నిర్వహించారు.  ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో ఏర్పాటు చేసిన 36 సెంటర్లలో 8,747 మంది పరీక్ష రాశారు.   పాల్వంచ సెంటర్​లో ఓ అభ్యర్థి హైటెక్​ కాపీయింగ్​కు పాల్పడుతుండగా ఇన్విజిలేటర్​పట్టుకున్నారు. అసలు 24 మంది అభ్యర్థులకు బదులు వేరే వ్యక్తులు పరీక్ష రాసినట్టు గుర్తించారు.

ముందే తెలిసినా.. నిర్లక్ష్యం

పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారని ఇద్దరు వ్యక్తులను నాలుగురోజుల ముందే అదుపులోకి తీసుకున్నట్లు సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. అయినా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయకపోవడంతో ఎగ్జామ్స్​లో భారీ అక్రమాలు జరిగాయి. బీహార్, ​ హర్యానా ముఠాలకు చెందిన 24 మంది అసలు కాండిడేట్లకు బదులు పరీక్ష రాయడానికి రూ. 30 లక్షలకు  అగ్రిమెంట్​ చేసుకున్నారు. హర్యానా, బీహార్​ల నుంచి సందీప్​, వికాస్​ మోర్​, కుమార్​ విశాల్​, శైలేష్​, కుమార్​యాదవ్​లు ​ 12 మంది నకిలీలను తీసుకొచ్చి కొత్తగూడెం సెంటర్​లో పరీక్ష రాయించారు. ఈ వ్యహారాలపై విచారణ జరిపి..  లక్ష్మీనారాయణ, కోల హరీశ్​ అనే సింగరేణి ఉద్యోగులతో పాటు  11 మందిని అరెస్టు చేశారు. వారిదగ్గర నుంచి రూ.11లక్షలు, 17 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ స్కామ్​లో కంపెనీలోని పెద్ద ఆఫీసర్ల  హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కారణంగా విచారణలో ఆలస్యం జరుగుతోందని చెప్తున్నా.. స్కాం నుంచి కొందరు పెద్దలను తప్పించే ప్రయత్నం జరగుతోందని కార్మికసంఘాలు ఆరోపిస్తున్నాయి. పోలీసుల విచారణ పూర్తయి రిపోర్టు వచ్చిన తర్వాతే రిజల్ట్స్​ ప్రకటించాలా.. లేదా ఎగ్జామ్​ రద్దు చేసి తిరిగి నిర్వహించాలా అన్నది సీఎండీ ఆదేశాల మేరకు నిర్ణయిస్తామని
ఆఫీసర్లు పేర్కొంటున్నారు.