5 ఓవర్లు.. 5 మెయిడిన్లు.. 5 వికెట్లు.. చరిత్ర సృష్టించిన గ్రీవ్స్

5 ఓవర్లు.. 5 మెయిడిన్లు.. 5 వికెట్లు.. చరిత్ర సృష్టించిన గ్రీవ్స్

Justin Greaves: పాకిస్థాన్‌తో ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ సంచలనం సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే వరుసగా 5 ఓవర్లు.. 5 మెయిడిన్లు.. 5 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా నిలిచి ప్రపంచ క్రికెట్‌ను షాక్‌కు గురి చేశాడు. తన అల్ట్రా-అక్యురేట్ లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్‌తో పాకిస్థాన్ బ్యాటర్లకు చుక్కలు చూపించి, ఒకానొక దశలో 244/3తో చాలా బలంగా ఉన్న పాక్‌ను 282 పరుగులకే ఆలౌట్ చేశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌కు విజయావకాశాలు లభించాయి.

బ్యాట్‌తోనే కాదు బాల్‌తోనూ రచ్చ: 
ఈ చారిత్రాత్మక స్పెల్‌తో జస్టిన్ గ్రీవ్స్ టెస్ట్ క్రికెట్‌లో తన తొలి ఫైవ్ వికెట్ హాల్ (5/27) నమోదు చేసుకున్నాడు. బార్బడోస్ కుర్రాడైన గ్రీవ్స్ ఇప్పటికే టెస్టుల్లో రెండు సెంచరీలు కొట్టి బ్యాటింగ్‌లో తన సత్తా ఏంటో చూపించగా, ఇప్పుడు కెరీర్ బెస్ట్ బౌలింగ్ ప్రదర్శనతో విండీస్ జట్టు తరపున మంచి ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. స్టువర్ట్ బ్రాడ్ (4 వరుస వికెట్-మెయిడిన్లు) పేరిట ఉన్న రికార్డును తిరగరాసి, టెస్ట్ చరిత్ర పుస్తకాల్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.

క్రికెట్ లవర్స్‌కు మైండ్ బ్లోయింగ్: 
రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ బౌలర్లు మళ్లీ పుంజుకుని మ్యాచ్‌ను రేసులోకి తీసుకొచ్చినప్పటికీ, ఈ మ్యాచ్‌ మొత్తానికే గ్రీవ్స్ వేసిన స్పెల్ హైలైట్‌గా నిలిచిపోయింది. క్రమశిక్షణ, ఓర్పు, కచ్చితమైన లెంత్ ఉంటే ఎలాంటి విధ్వంసం సృష్టించవచ్చో ఈ మ్యాచ్‌లో గ్రీవ్స్ చేసి చూపించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచిపోయే అతడి బౌలింగ్‌పై ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.