బోరు బావిలో బాలుడు.. 8 గంటల తర్వాత..

బోరు బావిలో బాలుడు.. 8 గంటల తర్వాత..

బోరు బావిలో బాలుడు పడిపోయిన ఘటన మహారాష్ట్ర రాష్ట్రం అహ్మద్ నగర్ జిల్లాలో జరిగింది. మార్చి 13వ తేదీ సోమవారం మధ్యాహ్నం.. పొలంలో బాలుడు ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు.. విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు.. వారు రెస్క్యూ టీంను రప్పించారు. 15 నుంచి 20 అడుగుల లోతులో బాలుడు ఉన్నట్లు గుర్తించిన సహాయ బృందాలు.. రక్షించేందుకు బోరుకు సమాంతరంగా గొయ్యిని తవ్వారు.

బాలుడిని కాపాడే క్రమంలో బావిలోకి ఆక్సిజన్ పంపిస్తూ.. మరోవైపు సహాయ చర్యలు కొనసాగించారు. మార్చి 14వ తేదీ మంగళవారం తెల్లవారుజామున బాలుడిని బయటకు తీశారు సిబ్బంది. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్నాడు.. పొలం దగ్గరే బాలుడికి చికిత్స అందిస్తూ.. అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో బాలుడు చనిపోయినట్లు ప్రకటించారు డాక్టర్లు. 

ఎనిమిది గంటల్లోనే ఆపరేషన్ పూర్తి చేసినా.. బాలుడి ప్రాణాలు కాపాడలేకపోయాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. వేగంగానే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిందని స్పష్టం చేసింది. కొన్నాళ్ల క్రితం ఈ బోరు వేశారని.. నీళ్లు పడకపోవటంతో నిర్లక్ష్యంగా వదిలేసినట్లు చెబుతున్నారు స్థానికులు. బోరుబావిలోని బాలుడి ఘటన విషాధంతంగా ముగియటంతో.. కొపర్డి గ్రామంలో విషాధం నెలకొంది.  పొలంలో చెరుకు పంట సాగవుతుందని.. పొలంలో పని కోసం వచ్చిన కార్మికుని కుమారుడిగా చెబుతున్నారు అధికారులు.