మంచిర్యాల జిల్లాలో మహిళలకు పెద్దపీట..పంచాయతీల్లో 50 శాతం రిజర్వేషన్లు

మంచిర్యాల జిల్లాలో మహిళలకు పెద్దపీట..పంచాయతీల్లో 50 శాతం రిజర్వేషన్లు
  •  306 జీపీల్లో 140 సర్పంచ్ స్థానాలు వారికే.. 
  •  2,680 వార్డుల్లో 1,149 సీట్లు అతివలకు..
  •   జనరల్ స్థానాల్లోనూ పోటీకి సై 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు కావడంతో పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన చోట పోటీ చేసేందుకు పలువురు ఆశావహులు ముందుకు వస్తున్నారు. 

జిల్లాలో 306 పంచాయతీలకు గాను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. అలాగే మహిళలకు మిగతా 50 శాతం సీట్లను రిజర్వ్ చేశారు. దీంతో మహిళలు పెద్ద సంఖ్యలో పోటీ చేసే అవకాశం వచ్చింది. రిజర్వ్​డ్​ సీట్లతో పాటు జనరల్ స్థానాల్లోనూ బరిలో నిలిచేందుకు పలువురు మహిళలు సిద్ధమవుతున్నారు.  

140 సీట్లు మహిళలకే.. 

 జిల్లాలో 306 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఇందులో మహిళలకు 140 సర్పంచ్​ స్థానాలు దక్కాయి. షెడ్యూల్డ్​ ఏరియాలో 39 పంచాయతీలకు గాను ఎస్టీ మహిళలకు 18 సీట్లు కేటాయించారు. నాన్ షెడ్యూల్డ్​ ఏరియాలో మరో 10 సీట్లు కలిపి మొత్తం 28 సర్పంచ్ స్థానాల్లో ఎస్టీ మహిళలు పోటీ చేయనున్నారు. 

అలాగే నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో 267 పంచాయతీలకు గాను ఎస్సీలకు 81 సీట్లు కేటాయించగా, అందులో 36 స్థానాలను మహిళలకు రిజర్వ్ చేశారు. బీసీలకు దక్కిన 23 పంచాయతీల్లో 10 మహిళా కోటాలోకి వెళ్లాయి. ఇక 137 అన్ రిజర్వ్​డ్ (జనరల్) సీట్లలో 66 మహిళలకు కేటాయించడం విశేషం. జనరల్ కేటగిరీలో సైతం బరిలో నిలిచేందుకు పలువురు మహిళలు ఉత్సాహం చూపుతున్నారు.

వార్డు మెంబర్లుగా 1,149 మంది

జిల్లావ్యాప్తంగా 2,680 వార్డులకు గాను మహిళలకు 1,149 సీట్లు దక్కాయి. ఎస్టీ మహిళలకు షెడ్యూల్డ్ ఏరియాలో 119, నాన్​ షెడ్యూల్డ్​ఏరియాలో 74, మొత్తం 193 వార్డులను కేటాయించారు. ఎస్సీ విమెన్​241, బీసీ విమెన్​125 సీట్లు రిజర్వ్​ చేయగా, అన్​రిజర్వ్​డ్​(జనరల్) వార్డుల్లో ఏకంగా 570 సీట్లను కేటాయించారు. 

మహిళా రిజర్వేషన్​ వివరాలు 

కేటగిరీ   సర్పంచ్​    వార్డు మెంబర్

ఎస్సీ         36                    241
ఎస్టీ           28                    193
బీసీ          10                     125
జనరల్​    66                     590