తెలంగాణకు 50 శాతం నీళ్లు కేటాయించాలె

తెలంగాణకు 50 శాతం నీళ్లు కేటాయించాలె
  • వాటా తేలే దాకా కృష్ణాలో చెరి సగం నీళ్లియ్యాలె
  • కేఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీకి నివేదించిన తెలంగాణ
  • శ్రీశైలం ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఎండీడీఎల్‌‌‌‌‌‌‌‌ 830 అడుగులకు తగ్గించండి
  • అవసరాల మేరకు ప్రాజెక్టుల రూల్‌‌‌‌‌‌‌‌ కర్వ్స్‌‌‌‌‌‌‌‌ మార్చండి
  • మా ప్రాజెక్టులకు 225 టీఎంసీలు కేటాయించండి

హైదరాబాద్, వెలుగు: కృష్ణాలో నీటి వాటా తేలే వరకు రాష్ట్రానికి 50 శాతం నీళ్లు కేటాయించాలని తెలంగాణ డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేసింది. నిర్మాణంలో ఉన్న, పూర్తయిన ప్రాజెక్టులకు 225 టీఎంసీల నికర జలాలు కేటాయించాలని కేఆర్ఎంబీని కోరింది. శ్రీశైలం రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌లో ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌, పవర్‌‌‌‌‌‌‌‌ జనరేషన్‌‌‌‌‌‌‌‌కు నీటిని తీసుకునే కనీస మట్టం బచావత్‌‌‌‌‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌ ప్రకారం తగ్గించాలని సూచించింది. శ్రీశైలం నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టులపై సీడబ్ల్యూసీ రూపొందించిన రూల్‌‌‌‌‌‌‌‌ కర్వ్స్‌‌‌‌‌‌‌‌(ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ ప్రొటోకాల్‌‌‌‌‌‌‌‌)పై తెలంగాణ పలు అభ్యంతరాలు లేవనెత్తింది. వాటిని వివరిస్తూ ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఈఎన్సీ(జనరల్‌‌‌‌‌‌‌‌) మురళీధర్‌‌‌‌‌‌‌‌ కేఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఎంపీ సింగ్‌‌‌‌‌‌‌‌కు బుధవారం లేఖ రాశారు.

811 టీఎంసీల్లో చెరి సగం
ఉమ్మడి ఏపీకి బచావత్‌‌‌‌‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌ కేటాయించిన 811 టీఎంసీలను తాత్కాలికంగా 66 : 34 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పంపిణీ చేశారని, ఇది కొనసాగించడానికి వీల్లేదన్నారు. బ్రజేశ్‌‌‌‌‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌(కేడబ్ల్యూడీటీ 2), ఇంటర్‌‌‌‌‌‌‌‌ స్టేట్‌‌‌‌‌‌‌‌వాటర్‌‌‌‌‌‌‌‌ డిస్ప్యూట్‌‌‌‌‌‌‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌లోని సెక్షన్‌‌‌‌‌‌‌‌ 3 ప్రకారం నీటి కేటాయింపులు నిర్ధారణయ్యే వరకు రెండు రాష్ట్రాలకు చెరిసగం నీటిని కేటాయించాలని కోరారు. సీడబ్ల్యూసీ రూపొందించిన రూల్‌‌‌‌‌‌‌‌ కర్వ్స్‌‌‌‌‌‌‌‌ ప్రకారం శ్రీశైలంలో 75 శాతం డిపెండబులిటీ వద్ద 582.5 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నట్టుగా పేర్కొన్నారని గుర్తు చేశారు. శ్రీశైలం ఆధారంగా తాము తలపెట్టిన ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్బీసీకి 40, కల్వకుర్తికి 40, పాలమూరు - రంగారెడ్డికి 90, డిండి లిఫ్ట్‌‌‌‌‌‌‌‌కు 30 టీఎంసీలు, జూరాలపై నిర్మించిన నెట్టెంపాడు ఎత్తిపోతలకు 25.4 టీఎంసీలు, మొత్తంగా 225.4 టీఎంసీల నికర జలాలు కేటాయించాలని కోరారు. శ్రీశైలం నీటిని బేసిన్‌‌‌‌‌‌‌‌ అవతలికి తరలించరాదని బచావత్‌‌‌‌‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌ స్పష్టతనిచ్చిందని, భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో ఇన్‌‌‌‌‌‌‌‌బేసిన్‌‌‌‌‌‌‌‌లో చేపట్టే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిందని తెలిపారు.

శ్రీశైలం ఎండీడీఎల్‌‌‌‌‌‌‌‌ సవరించండి
కర్వ్‌‌‌‌‌‌‌‌ రూల్స్‌‌‌‌‌‌‌‌లో శ్రీశైలం కనీస నీటిమట్టం 854 అడుగులుగా పేర్కొన్నారని, కమిటీ ఆన్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్స్‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ 1960 ప్రకారం రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌లో కనీస నీటిమట్టం 830 అడుగులని తెలిపారు. ఇదే విషయాన్ని బచావత్‌‌‌‌‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌ కూడా తేల్చిచెప్పిందన్నారు. పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల నీటికి బదులుగా నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌కు ఎగువన 80 టీఎంసీల కృష్ణా నికర జలాలు తీసుకోవడానికి గోదావరి ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌ అనుమతి ఇచ్చిందని, ఇప్పటికే మహారాష్ట్ర, కర్నాటక 35 టీఎంసీల నీటిని ఇలా తీసుకుంటున్నాయని తెలిపారు. ఉమ్మడి ఏపీకి దక్కే 45 టీఎంసీలతో ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్బీసీ ప్రాజెక్టును ప్రతిపాదించారని తెలిపారు. రూల్‌‌‌‌‌‌‌‌ కర్వ్స్‌‌‌‌‌‌‌‌లో 45 టీఎంసీలు క్యారీ ఓవర్‌‌‌‌‌‌‌‌గా నిల్వ చేయాలని పేర్కొన్నారని, ఇది తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. ఇలా నిల్వ చేస్తే తమకు హక్కుగా దక్కే 45 టీఎంసీలు కోల్పోతామని పేర్కొన్నారు. కృష్ణా డెల్టా సిస్టంకు నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ నుంచి 72.2 టీఎంసీలు మాత్రమే కేటాయించాలని కోరారు. సాగర్‌‌‌‌‌‌‌‌కు దిగువన ఉన్న క్యాచ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో 101.2 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయని, గోదావరి నుంచి మళ్లించే 80 టీఎంసీలను కలుపుకుంటే మొత్తంగా 181.2 టీఎంసీలు కేడీఎస్‌‌‌‌‌‌‌‌కు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈనేపథ్యంలో సాగర్‌‌‌‌‌‌‌‌ నుంచి కేడీఎస్‌‌‌‌‌‌‌‌కు కేటాయింపులు 72.2 టీఎంసీలకు తగ్గించాలని కోరారు. నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ తాగునీటికి బచావత్‌‌‌‌‌‌‌‌ అవార్డు ప్రకారం 5.7 టీఎంసీలు కేటాయించాలన్నారు. రూల్ కర్వ్స్‌‌‌‌‌‌‌‌లో తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని  మార్పులు చేయాలన్నారు.