రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఈ మేరకు చేసిన చట్ట సవరణకు సీఎం భజన్ లాల్ శర్మ ఆమోదం తెలిపారు. మహిళలకు కొత్త అవకాశాలు, ఉపాధిని సృష్టించడంలో ఈ నిర్ణయం తోడ్పడుతుందని సీఎం అన్నారు. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో రిజర్వేషన్లు పెంచుతామని బీజేపీ హామీ ఇచ్చింది.
మహిళలను గౌరవించడంలో తమ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని, గ్రేడ్-3 టీచర్ రిక్రూట్‌మెంట్‌లో మహిళలకు రిజర్వేషన్లు పెంచాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంలో ఇది కనిపిస్తుందన్నారు విద్యా మంత్రి మదన్ దిలావర్ . మహిళల అభివృద్ధి, సాధికారత కోసం కృషి చేయడంలో బీజేపీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. కాగా ఇప్పటివరకు ఈ రిజర్వేషన్ 30 శాతంగా ఉంది.
ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 27 వేల థర్డ్ గ్రేడ్ ఉపాధ్యాయుల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఈ చర్యను స్వాగతిస్తున్నాయని, ఇది మరింత మంది మహిళలను నియమించేందుకు దోహదపడుతుందని అన్నారు. ఇప్పటికే సర్వీసులో ఉన్న మహిళలను ప్రభుత్వం చూసుకోవాలని, ప్రత్యేకించి వితంతువులు లేదా ఇతర సమస్యలు ఎదుర్కొంటున్న వారికి సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వాలని కూడా వారు తెలిపారు.