అద్దాలు ఇయ్యరు... ఆపరేషన్లు చెయ్యరు

అద్దాలు ఇయ్యరు...  ఆపరేషన్లు చెయ్యరు

 

  • కంటి ఆపరేషన్ల కోసం సుమారు 50 వేల మంది ఎదురుచూపులు
  • ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 20.24లక్షల మందికి పరీక్షలు 
  • సమస్యలు గుర్తించినవారిలో కొంతమందికే అద్దాలు  
  • మిగతావారు అడిగితే ఆర్డర్లు పెట్టామంటున్న ఆఫీసర్లు

రాజన్న సిరిసిల్ల, వెలుగు :  ఉమ్మడి జిల్లాలో కంటి వెలుగు క్యాంపుల్లో జోరుగా పరీక్షలు చేస్తున్నారు. చాలామందికి కంటి చూపు సమస్యలు బయటపడుతుండడంతో డాక్టర్లు కండ్ల అద్దాలు, కొంతమందికి ఆపరేషన్లు రెఫర్ ​చేస్తున్నారు. అయితే చాలామందికి కంటి ఆపరేషన్లు అవసరమున్నా చేయడం లేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 63వేల మందికి ఆపరేషన్లు చేయాల్సి ఉంది. మరోవైపు కండ్ల అద్దాల్లోనూ రీడింగ్​ గ్లాసెస్​ఇచ్చి, పాయింట్​అద్దాలను పెండింగ్‌లో పెడుతున్నారు. ఇదేమని అడిగితే ఆర్డర్లు పెట్టామని ఆఫీసర్లు చెబుతున్నారు.  దీంతో కంటి వెలుగు క్యాంపులు కంటి పరీక్షలకే పరిమితమయ్యాయన్న  ఆరోపణలున్నాయి.  

ఆర్డర్లు పెట్టామంటూ కాలయాపన 

రెండో విడత కంటి వెలుగును ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం ప్రారంభించింది.  ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు సుమారు 20.24లక్షల మందికి కంటి పరీక్షలు చేశారు. వీరిలో సుమారు 3లక్షల మందికి కంటి సమస్యలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు.  వీరిలో చాలామందికి కంటి అద్దాలు అవసరముండగా కొందరికే అందాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో  2,76,834 మందికి  పరీక్షలు చేయగా వీరిలో 40,987 మందికి పాయింట్​అద్దాలు అవసరముండగా ఇప్పటివరకు 29,970 మందికి అందజేశారు. 

మరో 11,017 మందికి ఇవ్వాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. కరీంనగర్ ​జిల్లాలో 4,72,143 మందికి పరీక్షలు చేయగా, ఇందులో రీడింగ్​గ్లాసెస్​86,138 మందికి అందించగా, 66,975 మందికి పంపిణీ చేయాల్సి ఉంది.  పెద్దపల్లి జిల్లాలో 3,90,892 మందికి పరీక్షలు చేయగా, 54,173 మందికి రీడింగ్​ గ్లాసెస్ ​అందించారు.  జగిత్యాల జిల్లాలో 6 లక్షల 15వేల 265 మందికి కంటి పరీక్షలు చేయగా.. వీరిలో సమస్యలున్న వారిని గుర్తించి  76,845 మందికి రీడింగ్ గ్లాసెస్ అందించారు. మరో 1,01,793 మందికి పాయింట్ అద్దాలు అవసరం కాగా 84వేల 185 మందికే అందజేశారు. ఇంకా 17,608 మందికి ఇవ్వాల్సి ఉంది. మరోవైపు అద్దాలు అందనివారు  ఆఫీసర్లను నిలదీయగా ఆర్డర్లు పెట్టామని రాగానే ఇస్తామని చెబుతున్నారు.  

ఆపరేషన్లపై స్పష్టత కరువు

ఉమ్మడి జిల్లాలో కంటి వెలుగు క్యాంపుల్లో సుమారు 50వేల మందికి కంటి ఆపరేషన్లు అవసరమున్నట్లు డాక్టర్లు గుర్తించారు. వీరందరికీ స్థానికంగా ఆపరేషన్లు చేసే అవకాశం లేకపోవడంతో హైదరాబాద్‌, వరంగల్‌కు రెఫర్ ​చేస్తున్నారు. అయితే దీనిపై స్పష్టత లేకపోవడంతో వీరంతా ఆపరేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు.  రాజన్నసిరిసిల్ల జిల్లాలో 5వేల మందికి, జగిత్యాల జిల్లాలో 8వేల మందికి, పెద్దపల్లి జిల్లాలో 36 వేలమందికి కంటి ఆపరేషన్లు చేయాల్సి ఉంది. దీనిపై ఇప్పటివరకు వైద్యారోగ్య శాఖ నుంచి స్పష్టత వస్తేనే వీరందరికీ ఆపరేషన్లు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది

 జిల్లాలో రెండో విడుత కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి. 83 రోజులుగా 26 బృందాలు గ్రామగ్రామాన తిరుగుతూ క్యాంపులు నిర్వహిస్తున్నాయి. రీడింగ్, పాయింట్ అద్దాలను అందజేస్తున్నాం.  కంటి ఆపరేషన్లపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన వెంటనే ఆపరేషన్లు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తాం. 

- సుమన్ మోహన్ రావు, డీఎంహెచ్‌వో రాజన్నసిరిసిల్ల జిల్లా