లోక్‌‌‌‌సభ ఎన్నికల బరిలో తెలంగాణ నుంచి 50 మంది మహిళలు

లోక్‌‌‌‌సభ ఎన్నికల బరిలో తెలంగాణ నుంచి 50 మంది మహిళలు
  •     ప్రధాన పార్టీల నుంచి ఆరుగురు
  •     తొలిసారి రేసులో సుగుణ, కావ్య
  •     సిట్టింగ్ సీటును కాపాడుకునే పనిలో కవిత
  •     మహబూబ్‌‌నగర్‌‌‌‌లో టఫ్ పైట్ ఇస్తున్న అరుణ
  •     మాధవీలతపై జాతీయ స్థాయిలో ఫోకస్ 
  •     సీఎం సిట్టింగ్  సీటును దక్కించుకున్న సునీత

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం నుంచి పార్లమెంట్‌‌కు వెళ్లే మహిళల సంఖ్య ఈసారి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గత రెండు టర్మ్‌‌లు మహిళలకు మన రాష్ట్రం నుంచి పెద్దగా ప్రాతినిధ్యం దక్కలేదు. 2014, 2019 ఎన్నికల్లో ఒక్కో మహిళ మాత్రమే ఎంపీగా ఎన్నికయ్యారు. ఈసారి ఆ సంఖ్య కనీసం మూడింతలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 17 స్థానాల నుంచి 50 మంది మహిళలు బరిలో నిలిచారు. ఇందులో ప్రధాన పార్టీల నుంచి ఆరుగురు మహిళలు పోటీలో ఉన్నారు. వీళ్లందరూ వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ పడుతుండడంతో గరిష్టంగా ఆరు సీట్లు మహిళలు దక్కించుకునేందుకు అవకాశం ఉంది. మిగిలిన 46 మంది ఇండిపెండెంట్లుగా, చిన్నాచితక పార్టీల నుంచి బరిలోకి దిగారు. ప్రధాన పార్టీల తరపున పోటీచేస్తున్న మహిళలంతా ఎన్నికల్లో గెలిచేందుకు తమ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రత్యర్థులకు దీటుగా ప్రచారం చేస్తూ   జనాల్లోకి వెళ్తున్నారు. 

తొలిసారే గెలిచేలా

కాంగ్రెస్  నుంచి ముగ్గురు మహిళలు పోటీలో ఉన్నారు. వరంగల్ నుంచి కడియం కావ్య, ఆదిలాబాద్  నుంచి ఆత్రం సుగుణ, మల్కాజిగిరి నుంచి సునీతా ‌‌రెడ్డి టికెట్లు పొందారు. బీఆర్‌‌‌‌ఎస్  టికెట్‌‌ను వదిలేసుకుని తన తండ్రి కడియం శ్రీహరితో కలిసి కాంగ్రెస్‌‌లో చేరారు కావ్య. 41 ఏండ్ల ఈ స్పెషలిస్ట్‌‌  డాక్టర్.. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్​ (బీజేపీ), వరంగల్  జడ్పీ సిట్టింగ్  చైర్ పర్సన్, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన సుధీర్‌‌ ‌‌కుమార్‌‌‌‌(బీఆర్‌‌‌‌ఎస్‌‌) పై బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలిచిన ఆరుగురు మహిళల్లో కావ్య అత్యంత పిన్న వయస్కురాలు. ఆమెను పార్లమెంట్‌‌కు పంపించేందుకు ఆమె తండ్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రంగా శ్రమిస్తున్నారు. కావ్యను గెలిపించేందుకు మహిళా మంత్రి కొండా సురేఖ కూడా కష్టపడుతున్నారు. ఇదే నియోజకవర్గ పరిధిలో వచ్చే పాలకుర్తి నుంచి సీనియర్  లీడర్, అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావును ఓడించి యశస్విని రెడ్డి చరిత్ర సృష్టించారు. ఇక మల్కాజిగిరి నుంచి పోయిన ఎన్నికల్లో సీఎం రేవంత్‌‌ రెడ్డి ఎంపీగా గెలిచారు. ఆయన సిట్టింగ్  సీటును మాజీ మంత్రి మహేందర్‌‌‌‌ రెడ్డి భార్య సునీతా రెడ్డి దక్కించుకున్నారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌  నుంచి వికారాబాద్  జడ్పీ చైర్మన్‌‌గా ఉన్న ఆమె.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌‌లో చేరారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌‌ (బీజేపీ)‌‌, రాగిడి లక్ష్మారెడ్డి (బీఆర్‌‌‌‌ఎస్‌‌) వంటి సీనియర్లతో సునీత ఫైట్  చేస్తున్నారు. ఇప్పటికే ఆమె తరపున సీఎం రేవంత్‌‌  పలుమార్లు మల్కాజ్‌‌గిరికి వచ్చి ప్రచారం చేశారు. సీఎం సిట్టింగ్  సీటు కావడంతో దాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది.

టీచర్  గెలుపు బాధ్యతలు సీతక్కకు

ఆదిలాబాద్  నుంచి కాంగ్రెస్  అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆత్రం సుగుణ కూడా చట్టసభలకు పోటీచేయడం ఇదే తొలిసారి. ఆమె ఈ ఏడాది ఏప్రిల్‌‌లో టీచర్  ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌‌లో చేరారు. మహిళలు, గిరిజనుల హక్కుల కోసం అనేక ఉద్యమాల్లో ఆమె పాల్గొన్నారు. ఆమె మీద ప్రభుత్వాలు 50కిపైగా కేసులు నమోదు చేశాయి. ప్రభుత్వ టీచర్‌‌‌‌గా ఉంటూనే ప్రజల కోసం పోరాడుతూ ఆదిలాబాద్‌‌లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్  నుంచి ఆమెకు ఎంపీ టికెట్‌‌  ఇచ్చారు. మాజీ ఎంపీలు ఆత్రం సక్కు, గొడెం నగేష్​పై సుగుణ పోటీచేస్తున్నారు. ఆమె గెలుపు బాధ్యతలను మంత్రి సీతక్క తీసుకున్నారు. సుగుణకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, ఆమె గెలిచి రికార్డు నెలకొల్పుతుందని సీతక్క చెబుతున్నారు.

ఒక్కరికే టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్‌‌

గత టర్మ్‌‌లో ఇద్దరు మహిళలకు టికెట్లు ఇచ్చిన బీఆర్‌‌‌‌ఎస్.. ఈసారి ఒక్కరికి మాత్రమే సీటిచ్చింది. 2014 ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఏకైక మహిళా  ఎంపీగా కల్వకుంట్ల కవిత ఉన్నారు. అప్పుడు నిజామాబాద్ నుంచి గెలిచిన ఆమె.. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌‌ చేతిలో  ఓడిపోయారు. ఈసారి ఆమె పూర్తిగా పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం లిక్కర్ కేసులో జైల్లో ఉన్నారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఏకైక మహిళా ఎంపీగా మాలోతు కవిత ఉన్నారు. మరోసారి ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మహబూబాబాద్‌‌  సిట్టింగ్ ఎంపీగా తన స్థానాన్ని కాపాడుకునేందుకు శ్రమిస్తున్నారు. కవిత తరపున ఆమె కూతురు, కొడుకు సహా కుటుంబ సభ్యులంతా ప్రచారం చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌‌ (కాంగ్రెస్), మాజీ ఎంపీ సీతారాం నాయక్‌‌ (బీజేపీ) నుంచి ఆమె గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.

అసదుద్దీన్‌‌కు దీటుగా

ఎంఐఎం చీఫ్  అసదుద్దీన్‌‌ ను ఓడించేందుకు బీజేపీ క్యాండిడేట్  మాధవీలత తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాజకీయాల్లో వచ్చి రాగానే బీజేపీ నుంచి ఎంపీ టికెట్  తెచ్చుకుని అందరి దృష్టిని ఆమె ఆకర్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం తన మన్‌‌ కీ బాత్‌‌లో ఆమె గురించి ప్రస్తావించడం, ట్విటర్‌‌‌‌లో ఆమె గురించి పోస్ట్  చేయడంతో మాధవీలతకు జాతీయ స్థాయిలో క్రేజ్  వచ్చింది. జాతీయ మీడియా సైతం ఆమెతో ఇంటర్వ్యూలు నిర్వహించడంతో క్రేజ్  మరింత పెరిగింది. తన ప్రసంగాలు, ప్రచారంలో బాణాలు సంధిస్తున్నట్టు మాధవీలత ఇస్తున్న హావభావాలతో మీడియాతో పాటు, ప్రజల్లోనూ ఆమె గురించి చర్చ జరుగుతోంది. సోషల్  మీడియాలోనూ ఆమె ప్రచారానికి మంచి స్పందన వస్తోంది. హైదరాబాద్‌‌లో అసదుద్దీన్‌‌కు, ఆమెకు మధ్యే ఫైట్  జరుగుతోంది. బీఆర్‌‌‌‌ఎస్‌‌, కాంగ్రెస్‌‌  అభ్యర్థులు అసలు ఊసులోనే లేరని ఓల్డ్‌‌ సిటీ ఓటర్లు చెబుతున్నారు. అలాగే బీజేపీ నుంచి పోటీచేస్తున్న మరో మహిళ డీకే అరుణ. గత లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆమె.. అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఈసారి ఎలాగైనా ఎంపీగా గెలవాలని పట్టుదలగా పనిచేస్తున్నారు. మహబూబ్‌‌నగర్‌‌‌‌  సిట్టింగ్  ఎంపీ మన్నె శ్రీనివాస్‌‌ రెడ్డి (బీఆర్‌‌‌‌ఎస్‌‌), మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ ‌‌రెడ్డి (కాంగ్రెస్‌‌) పై ఆమె పోటీచేస్తున్నారు.