ప్రాజెక్టుల పనులు పూర్తి కావాలంటే  5 వేల కోట్లు కావాలె

ప్రాజెక్టుల పనులు పూర్తి కావాలంటే  5 వేల కోట్లు కావాలె
  • ఇరిగేషన్‌‌‌‌ వర్క్‌‌‌‌షాప్‌‌‌‌లో సమస్యలు ఏకరువు పెట్టిన సీఈలు
  • 2,498 ఎకరాల భూమి సేకరించాల్సి ఉందన్న ఆఫీసర్లు  
  •  నిధులు విడుదల చేయకుంటే ఏమీ చేయలేమని వెల్లడి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలోని ప్రాజెక్టుల పెండింగ్‌‌‌‌ పనులతో పాటు భూ సేకరణకు నిధులిస్తేనే పూర్తి చేయగలమని ఇరిగేషన్‌‌‌‌ చీఫ్‌‌‌‌ ఇంజనీర్లు (సీఈ) తేల్చి చెప్పారు. వీటి కోసం దాదాపు రూ.5 వేల కోట్లు విడుదల చేయాలని కోరారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రంగనాయకసాగర్‌‌‌‌ గెస్ట్‌‌‌‌ హౌస్‌‌‌‌లో స్పెషల్‌‌‌‌ సీఎస్‌‌‌‌ రజత్‌‌‌‌ కుమార్‌‌‌‌ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఇరిగేషన్‌‌‌‌ వర్క్‌‌‌‌షాప్‌‌‌‌లో సమస్యలపై సీఈలు ఏకరువు పెట్టారు. డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ పరిధిలోని 19 టెరిటోరియల్‌‌‌‌ సీఈలు ఈ వర్క్‌‌‌‌షాప్‌‌‌‌లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఫీల్డ్‌‌‌‌లో తాము ఎదుర్కొంటున్న సమస్యలపైనే వాళ్లంతా దృష్టి పెట్టారు. ఆయకట్టు పెంచాలని ప్రభుత్వం లక్ష్యాలు పెడుతోంది.. కానీ నిధులు ఇవ్వడంలో అలసత్వం వహిస్తోందని చెప్పారు. నిధులు విడుదల చేయకుండా పనులు చేయడం సాధ్యం కాదని చేతులెత్తేశారు. పెండింగ్‌‌‌‌ బిల్లులతో పాటు భూసేకరణ అంశాలపై గురువారం ఆర్థిక మంత్రి హరీశ్‌‌‌‌రావుతో సమావేశం కావాల్సి ఉన్నా ఆయన బిజీగా ఉండటంతో వాయిదా వేశారు.
 

భూ సేకరణే పెద్ద సమస్య
కాళేశ్వరం నుంచి అన్ని ప్రాజెక్టులకూ భూ సేకరణే ప్రధాన సమస్యగా ఉందని సీఈలు రజత్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌కు వివరించారు. ప్రాజెక్టులకు సంబంధించిన ప్రధాన పనులు కావాలంటే 2,498 ఎకరాల భూమి సేకరించాల్సి ఉందని తెలిపారు. భూ సేకరణతో పాటు ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌ఆర్‌‌‌‌ ప్యాకేజీలు, ఇతరత్రా పనులకు రూ.800 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్ల వరకు ఖర్చవుతుందని తెలిపారు. కాంట్రాక్టర్లు ఇప్పటికే చేసిన పనులకు సుమారు రూ.4 వేల కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌‌‌‌ ఉన్నాయని తెలిపారు. లోన్‌‌‌‌ లింకేజీ ఉన్న ప్రాజెక్టుల పేమెంట్లు కూడా ఆలస్యమవుతున్నాయని వివరించారు. లోన్‌‌‌‌ లింకేజీ లేని ప్రాజెక్టులకు బడ్జెట్‌‌‌‌ నుంచి నిధులు ఇప్పించేందుకు ప్రయత్నించాలని వారు కోరారు. డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఎదుర్కొంటున్న సమస్యలను ఆర్థిక మంత్రి హరీశ్‌‌‌‌రావుకు వివరించి, వీలైనంత త్వరగా బిల్లులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. వీటిపై స్పందించిన స్పెషల్‌‌‌‌ సీఎస్‌‌‌‌ సమస్యను సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌తో పాటు ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.