పండుగకు దూరంగా 50వేల ఆర్టీసీ కార్మిక కుటుంబాలు

పండుగకు దూరంగా 50వేల ఆర్టీసీ కార్మిక కుటుంబాలు

జీతాల్లేవు..చేతిలో చిల్లిగవ్వ లేదు..కొత్త బట్టల్లేవు..పిండివంటల వాసన లేదు..దసరా వచ్చిదంటే ఊరువాడ అంతా సంబురమే. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు మాత్రం…పండుగ సంబురమే కరువైంది. అందరూ సంతోషంగా ఉంటే..తాము పస్తులుంటున్నామని ఆవేదన చెందుతున్నారు.

రాష్ట్రంలో అతి పెద్ద పండుగ దసరా. ఈ పండగొచ్చిదంటే పేదవాళ్లతో సహా ఎవరి స్థాయికి తగ్గట్లు వాళ్లు సెలబ్రేట్ జరుపుకొంటారు. ఇంటిళ్లి పాది కొత్త బట్టలు తెచ్చుకుంటారు. పిండి వంటలు చేసుకొని సంబురంగా గడుపుతారు. ఆర్టీసీ కార్మికులకు మాత్రం పండుగ దూరమైంది. ఇంటిల్లిపాది సంతోషంగా ఉండాల్సిన రోజు ..ఆవేదన, ఆందోళనతో పరేషాన్ అయితున్నారు. దాదాపు 50వేల ఆర్టీసీ కార్మిక కుటుంబాలు పండుగకు దూరమయ్యాయి.

సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. కార్మికులకు పండుగ పూట పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడింది. జీతాలు రాక…చేతిలో చిల్లిగవ్వలేక పాట్లు పడుతున్నారు. సర్కార్ జీతాలిచ్చినా…ఎంతో కొంత సంతోషముందేడని చెప్తున్నారు.

పండుగ పూట పిల్లలకు కనీసం కొత్త బట్టలు కొనే పరిస్థితి లేకపోయిందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రతి ఏటా ఎంతో సంతోషంగా ఉండేటోళ్లమని..ఇప్పుడు ఆ సంతోషం లేకుండా పోయిందని బాధపడుతున్నారు. ఇయ్యాల్సిన జీతాలు ఇవ్వకపోగా…ఉద్యోగాలే పోయాయని సర్కార్ బెదిరిస్తోందని ఆవేదన చెందుతున్నారు.

ఆర్టీసీలో జాబ్ చేసే దాని కంటే కూలీ పని చేసుకుంటే మంచిదపే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి కార్మికుల కుటుంబాలు. ప్రభుత్వం నెలకు 50వేల జీతాలు ఇస్తున్నామని చెబుతున్నా కనీనం 30వేలు కూడా లేవని వాపోతున్నారు. సమ్మె చేస్తున్న కారణంగా జీతాలు ఆపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికైనా జీతాలు ఇవ్వాలని, కార్మికుల డిమాండ్లు పరిష్కారించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాయి కార్మిక కుటుంబాలు. పండుగ దూరమైన ఫర్వాలేదు… సమస్యలకు దారి చూపాలని విన్నవించుకుంటున్నాయి.