
హైదరాబాద్ గచ్చిబౌలి ఓఆర్ఆర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మహిళను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు కార్లు నుజ్జనుజ్జ అయ్యాయి. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయాలైన వారిని స్థానికి ఆస్పత్రికి తరలించారు. ఆగస్టు 5న సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే ... చేవెళ్ల మండలం ఆలూర్‌కు చెందిన బుచ్చయ్య, పద్మజ దంపతుల దగ్గర కమ్మెట విజయ్‌గౌడ్ అనే వ్యక్తి రూ.4లక్షలు అప్పుగా తీసుకున్నాడు. తిరిగి అప్పు చెల్లించే క్రమంలో బుచ్చయ్య దంపతులతో గొడవ జరగడంతో విజయ్ గౌడ్ వారిపై కక్ష పెంచుకున్నాడు. కట్ చేస్తే ఇటీవల బుచ్చయ్య అస్వస్థతకు గురై మల్కారంలోని రిహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నాడు.
ఇదే అదునుగా తీసుకున్న విజయ్ అదే గ్రామానికి చెందిన వెంకటేశ్, సాయిలతో కలిసి కారులో ఆసుపత్రికి వెళ్లాడు. ప్రధాన గేట దగ్గర ఉన్న పద్మజను బలవంతంగా కారులో ఎక్కించుకుని సర్వీస్ రోడ్డు మీదుగా తీసుకెళ్లాడు. మహిళ కేకలు వేయగా కారులోనే ఆమెను చితకబాదారు. కొత్వాల్‌గూడ సమీపంలోకి రాగానే విజయ్‌గౌడ్ నడిపిస్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.