షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టేటోళ్లు జర జాగ్రత్త బాస్.. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో ఏమైందంటే..

షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టేటోళ్లు జర జాగ్రత్త బాస్.. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో ఏమైందంటే..

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో విషాద ఘటన వెలుగుచూసింది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయి దయాకర్(29) అనే యువకుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆన్లైన్ ట్రేడింగ్ కోసం 7 లక్షల రూపాయలు అప్పు చేసి మరీ దయాకర్ పెట్టుబడులు పెట్టాడు. తన దగ్గర ఉన్న డబ్బుతో పాటు అప్పు చేసిన డబ్బు కూడా పోవడంతో మనస్తాపం చెంది ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఏడాది క్రితమే అనారోగ్యంతో దయాకర్ తండ్రి మృతి చెందడం.. ఇప్పుడు దయాకర్ కూడా చనిపోవడంతో అతని తల్లి ఒంటరిగా మిగిలిపోయింది. ఆన్​లైన్​బెట్టింగ్, ట్రేడింగ్ కు కుటుంబాలు బలైపోయిన ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 2024 సెప్టెంబర్లో హైదరాబాద్లోని గాజుల రామారంలో కూడా ఇలాంటి విషాద ఘటనే వెలుగుచూసింది. బెట్టింగ్, ట్రేడింగ్లో రూ.20 లక్షలకు పైగా నష్టపోయి, చేసిన అప్పులు తీర్చలేక ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. 

2024 డిసెంబర్లో స్టాక్​మార్కెట్లో వచ్చిన నష్టాలు, వాటిని తీర్చేందుకు చేసిన అప్పులు ఆ కుటుంబం మొత్తాన్ని బలి తీసుకున్నాయి. అప్పు ఇచ్చిన వాళ్లు ఒత్తిడి చేయడంతో నలుగురు గడ్డి మందు తాగారు. చికిత్స పొందుతూ నలుగురూ చనిపోయారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాసిపేట గ్రామానికి చెందిన సముద్రాల మొండయ్య, శ్రీదేవి దంపతులు. వీరికి కూతురు చైతన్య, కొడుకు శివప్రసాద్ ఉన్నారు. గ్రామంలోనే మొండయ్య చిన్న కిరాణాకొట్టుతో పాటు పాల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కొడుకు శివప్రసాద్ స్టాక్​మార్కెట్లో పెట్టుబడుల కోసం ఊళ్లో అప్పులు చేశాడు. చివరికి రూ.లక్షల్లో నష్టపోయాడు. చేసిన అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేసుకుంటూ వెళ్లాడు.

ఇలా రెండున్నర సంవత్సరాల కిందే మొత్తం అప్పు రూ.31 లక్షలు ఉన్నట్లు తెలిసింది. వీటికి వడ్డీలు పెరిగిపోయి తీర్చలేనంత భారంగా మారిపోయాయి. దీంతో శివప్రసాద్పై అప్పుల వాళ్ల ఒత్తిడి పెరిగింది. ఈ బాధలు తట్టుకోలేక ఏడాది కింద విజయవాడ వెళ్లి కృష్ణా బ్యారేజ్పై ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అక్కడి పోలీసులు అతన్ని కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ శివప్రసాద్పై అప్పుల వాళ్ల ఒత్తిడి మొదలైంది. దీంతో అప్పులోళ్లు గ్రామంలో పంచాయితీ పెట్టారు. 2024, నవంబర్ 30 వరకు డబ్బులు చెల్లిస్తానని శివప్రసాద్ ఒప్పుకున్నాడు. ఆ గడువు దాటిపోవడంతో మళ్లీ డిసెంబర్ 10, 2024 వరకు పొడిగించాడు.

ఈ పరిస్థితుల్లో మొండయ్యతో పాటు శివప్రసాద్కు అప్పుల వాళ్ల భయం పట్టుకున్నది. అప్పులు తీర్చడానికి వేరే మార్గం లేకపోవడంతో నలుగురు గడ్డి మందు తాగారు. విషయం తెలుసుకున్న స్థానికులు వీరిని వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కు తరలించారు. మొండయ్య (58), శ్రీదేవి (53), చైతన్య (30), శివప్రసాద్ (26) నలుగురూ చికిత్స పొందుతూ చనిపోయారు. నలుగురి డెడ్​బాడీలకు పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు. గురువారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మొండయ్య బంధువు రమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తాండూరు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.