సినిమా షూటింగ్ లకు బ్రేక్.. బాంబే నుంచి కార్మికులను తెస్తే తరిమి కొడతామన్న నారాయణ

సినిమా షూటింగ్ లకు బ్రేక్.. బాంబే నుంచి కార్మికులను తెస్తే తరిమి కొడతామన్న నారాయణ

తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ కార్మికులు చేపట్టిన సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. 30 శాతం వేతనాల పెంపు డిమాండ్లపై నిర్మాతలు, కార్మికుల మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటికీ ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు. ఇరు వర్గాల మధ్య వేర్వేరు అభిప్రాయాలు, ఆరోపణలతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతోంది.

కొలిక్కిరాని చర్చలు.. 
కార్మికుల వేతనాల పెంపు డిమాండ్‌పై చర్చించేందుకు నిర్మాతల కోఆర్డినేషన్ కమిటీ, కార్మిక సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగిందని కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీరశంకర్ ప్రసాద్ తెలిపారు. అయితే, నాలుగు ప్రధాన అంశాలపై చర్చించగా, కేవలం రెండు అంశాలపై మాత్రమే ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పారు. మిగిలిన రెండు అంశాలపై ప్రతిష్టంభన కొనసాగుతోందని, మరికొన్ని సమావేశాల తర్వాత సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మాట్లాడుతూ, వేతనాల పర్సెంటేజ్ గురించి చర్చించలేదని, మిగిలిన రెండు అంశాలపై యూనియన్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. చిన్న సినిమాలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

30 శాతం పెంచడం అసాధ్యం.. 
పెద్ద నిర్మాతలు 30 శాతం వేతనాలు పెంచడం కష్టమని వాదిస్తున్నారు. పెద్ద సినిమాలు తీస్తే ఆదాయం ఖచ్చితంగా ఉంటుందన్నది కేవలం అపోహ అని, సినిమా బ్లాక్‌బస్టర్ అయితేనే నిర్మాత గట్టెక్కుతున్నారని వారు వివరించారు. ముఖ్యంగా, 'ఇక్కడి టెక్నీషియన్లతో క్వాలిటీ రావడం లేదు' అనే వాదనను పెద్ద నిర్మాతలు తెరపైకి తెచ్చారు. అందుకే క్వాలిటీ కోసం బయటి నుంచి టెక్నీషియన్లను తీసుకురావాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మాలీవుడ్‌లో రూ. కోటి ఖర్చయ్యే సినిమాకు టాలీవుడ్‌లో రూ. 4 కోట్ల వరకు ఖర్చు అవుతోందని, ఇక్కడ  సినిమా సెట్‌లో పనిచేసే 300 మందిలో సగం మందికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల స్థాయిలో వేతనాలు ఇస్తున్నామని వారు పేర్కొన్నారు. పెద్ద నిర్మాతలు వేతనాలు పెంచగలరేమో కానీ, ఆ భారాన్ని మేము మోయలేరని  చిన్న నిర్మాతలు తమ వాదనను వినిపిస్తున్నారు.

'స్కిల్ లేదంటే ఎలా.. ప్రపంచ ఖ్యాతి ఎలా వచ్చింది?'
నిర్మాతలు లేవనెత్తిన 'స్కిల్ లేదనే' వాదనపై సినీ కార్మికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్కిల్ లేకపోతే తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఎలా వచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు కార్మికుల పక్షాన సీపీఐ జాతీయ నేత నారాయణ గళం విప్పారు. 'కళామతల్లికి సేవ చేసే కార్మికుల పొట్ట కొట్టొద్దు అని ఆయన నిర్మాతలకు సూచించారు. హీరో, హీరోయిన్లకు కోట్లు ఇస్తున్నప్పుడు కార్మికులకు 30 శాతం పెంచడం పెద్ద కష్టమేం కాదన్నారు.  కనీసం 15 శాతం పెంచడం న్యాయబద్ధమే అని అన్నారు.   సినిమా పెద్దలతో కాదు .. కార్మికులను పిలిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాలని కోరారు. ప్రభుత్వం కూడా టికెట్ల ధరలు పెంచి బ్లాక్ టికెట్లను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. కార్మికులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని, బయటి నుంచి కార్మికులను తీసుకువస్తే తరిమి కొడతామని నారాయణ హెచ్చరించారు.

ఈ మొత్తం సంక్షోభం నుంచి బయటపడాలంటే ఇరు వర్గాలు సామరస్యపూర్వక వాతావరణంలో చర్చలు జరపడం ఒక్కటే మార్గం. లేకపోతే ఈ సమ్మె వల్ల తెలుగు సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని  సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే నాలుగు రోజుల నుంచి సినిమా షూటింగ్ బంద్ తో నిర్మాతలు,  కార్మికులు నష్టపోతున్నారని చెబుతున్నారు..