రాఖీ వేళ తెలంగాణలో విషాదం.. చనిపోయిన తమ్ముడికి రాఖీ కట్టిన అక్క.. కన్నీళ్లు తెప్పిస్తోన్న ఘటన

రాఖీ వేళ తెలంగాణలో విషాదం.. చనిపోయిన తమ్ముడికి రాఖీ కట్టిన అక్క.. కన్నీళ్లు తెప్పిస్తోన్న ఘటన

అన్నాచెల్లెళ్లు.. అక్కాతమ్ముళ్ల బంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ వేళ ప్రతి ఒక్కరికీ కన్నీళ్లు తెప్పించే ఘటన ఒకటి చోటు చేసుకుంది. సోదరుడి మృతదేహానికే ఓ సోదరి రాఖీ కట్టింది. రాఖీ పండుగకు రెండు రోజుల ముందు అనారోగ్యంతో సోదరుడు చనిపోయాడు. తమ్ముడికి రాఖీ కట్టాలనే సంతోషంలో ఉన్న సోదరికి ఈ పిడుగు లాంటి వార్త తెలియడంతో ఆమె గుండె ముక్కలైంది. తమ్ముడు ఇక లేడనే చేదు నిజాన్ని ఆమె జీర్ణించుకుకోలేకపోయింది. విగత జీవిగా పాడై పై పడుకుని ఉన్న తమ్ముడికి రాఖీ కట్టింది. ఈ హృదయవిదారక దృశ్యం అక్కడున్న వారందరి చేత కన్నీళ్లు పెట్టించింది. ఈ ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. 

వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన పందిరి అప్పిరెడ్డి కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం (ఆగస్ట్ 6) మృతి చెందాడు. రాఖీ పండుగ రెండు రోజులే ఉండటంతో అప్పిరెడ్డి సోదరి జ్యోతి తమ్ముడికి రాఖీ కట్టేందుకు రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సమయంలో ఒక్కసారిగా తమ్ముడు చనిపోయాడనే పిడుగు లాంటి వార్త ఆమెకు తెలిసింది.

తమ్ముడి మరణవార్త విని బోరుబోరున విలపిస్తూ సోదరుడి ఇంటికి చేరుకుంది. వస్తూ వస్తూ తమ్ముడి కడదామని ముందే కొన్న రాఖీ కూడా తీసుకువచ్చింది. దు:ఖాన్ని దిగమింగుకుని పాడై పై విగత జీవిగా పడి ఉన్న తమ్ముడి మృతదేహానికి రాఖీ కట్టింది. ఈ సమయంలో.. రాఖీ కడతా లే తమ్ముడు.. ఇదే నీకు  చివరి రాఖీ అంటూ జ్యోతి కన్నీరుమున్నీరుగా విలపించింది. జ్యోతి రోదించిన తీరు చూసి ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు గ్రామస్తులు ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమెను రోదనను ఆపడం ఎవరి తరం కాలేదు. దీంతో అక్కడ ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. అక్కాతమ్ముళ్ల బంధం చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు నెటిజన్లు.