ఘనాలో ఘోర విమాన ప్రమాదం.. కుప్పకూలిన సైనిక హెలికాప్టర్.. ఇద్దరు కేంద్ర మంత్రులు మృతి

ఘనాలో ఘోర విమాన ప్రమాదం.. కుప్పకూలిన సైనిక హెలికాప్టర్.. ఇద్దరు కేంద్ర మంత్రులు మృతి

అక్ర: ఘనాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. సైనిక హెలికాప్టర్ కుప్పకూలి ఇద్దరు క్యాబినెట్ మంత్రులు సహా ఎనిమిది మంది మృతి చెందారు. మృతుల్లో ఘనా దేశ రక్షణ మంత్రి ఎడ్వర్డ్ ఒమానే బోమా, పర్యావరణ మంత్రి ఇబ్రహీం ముర్తాలా ముహమ్మద్ ఉన్నారని ఆ దేశ ప్రభుత్వం ధృవీకరించింది. బుధవారం (ఆగస్ట్ 6) ఉదయం Z-9 యుటిలిటీ సైనిక హెలికాప్టర్ ఘనా రాజధాని అక్ర నుంచి ఒబువాసికి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హెలికాప్టర్ ఏటీసీతో కమ్యూనికేషన్ కోల్పోయి క్రాష్ అయ్యింది. 

ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ఇద్దరు కేబినెట్ మంత్రులతో పాటు నేషనల్ డెమోక్రటిక్ కాంగ్రెస్ వైస్ చైర్‌పర్సన్, సీనియర్ జాతీయ భద్రతా సలహాదారు, ఇతర సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద తీవ్రతకు హెలికాప్టర్ లో ఉన్న అందరూ చనిపోయారని వెల్లడించారు అధికారులు. 

సమాచారం అందుకున్న రెస్య్కూ టీమ్స్ ఘటన స్థలంలో యుద్ధప్రాతిపదిక సహయక చర్యలు చేపట్టాయని తెలిపారు. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదని.. నిపుణుల బృందం దర్యాప్తు మొదలుపెట్టిందని చెప్పారు. సాంకేతిక లోపం కారణంగానే హెలికాప్టర్ క్రాష్ అయినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. ఈ సంఘటనను  జాతీయ విషాదంగా పేర్కొంది ఘనా ప్రభుత్వం.

ఘనాలో దశాబ్ద కాలంలో జరిగిన అత్యంత దారుణమైన విమాన ప్రమాదాలలో ఇదొకటని అధికారులు పేర్కొన్నారు. 2014లో తీరంలో హెలికాప్టర్ కూలిపోవడంతో ముగ్గురు మరణించగా.. 2021లో రాజధాని అక్రాలో ఒక కార్గో విమానం రన్‌వేను దాటి ప్రయాణీకుల బస్సును ఢీకొట్టడంతో 10 మంది మరణించారని వెల్లడించారు.