
- గతంలో రికార్డు స్థాయిలో 1,179 అప్లికేషన్లు
- చివర్లో పెరుగుతాయని ఆఫీసర్ల అంచనా
- రెండు మద్యం దుకాణాలను తగ్గించిన సర్కార్
- బార్డర్ దుకాణాలపై ఆసక్తి చూపని ఏపీ వాసులు
గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో లిక్కర్ షాప్‌ల దరఖాస్తులు స్లోగా దాఖలవుతున్నాయి. ఇప్పటివరకు 55 దరఖాస్తులు దాఖలైనట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఈనెల 18 వరకు గడువు ఉండగా, చివరి మూడు రోజుల్లో పెద్ద మొత్తంలో అప్లికేషన్లు దాఖలవుతాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, రెండేండ్ల కింద 36 వైన్ షాప్‌లకు దరఖాస్తులు ఆహ్వానించగా, ఈసారి 34 వైన్స్‌కు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అలంపూర్ లో ఒకటి, రాజోలి మండలం మాన్‌దొడ్డిలో ఒక లిక్కర్ షాపు తొలగించారు. ఈసారి దరఖాస్తు చేసుకునే సమయంలో కట్టాల్సిన డిపాజిట్ అమౌంట్ పెరగడం, బార్డర్ లిక్కర్ షాపులు దక్కించుకునేందుకు ఏపీ వాసులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో దరఖాస్తులు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.
ఇప్పటివరకు 17 దరఖాస్తులే..
గద్వాల పరిధిలో 21, అలంపూర్ పరిధిలో 13 వైన్ షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తుండగా, 34 షాపులకు ఇప్పటి వరకు 55 దరఖాస్తులు వచ్చాయి. అయితే చివరి మూడు రోజుల్లో దరఖాస్తులు గణనీయంగా పెరిగే ఛాన్స్ ఉందని ఎక్సైజ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు జరగనుండడంతో లిక్కర్ షాపులను దక్కించుకునేందుకు పోటీ నెలకొంటుందని అంటున్నారు. గతంలో జిల్లాలోని 36 వైన్ షాపులకు రికార్డు స్థాయిలో 1,179 దరఖాస్తులు వచ్చాయి. ఇలా ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల చొప్పున ఖజానాకు రూ.23.42 కోట్ల ఆదాయం సమకూరింది.
బార్డర్ షాపులపై ఆసక్తి కరువు..
జిల్లాలోని సరిహద్దులోని లిక్కర్ షాప్‌లపై ఏపీ, కర్నాటకకు చెందిన వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. గతంలో ఏపీలో లిక్కర్ పాలసీ లేకపోవడంతో అక్కడి వ్యాపారులు పెద్ద ఎత్తున తెలంగాణలో లిక్కర్ దందా చేసేందుకు పోటీపడ్డారు. కానీ, ఈసారి అక్కడ లిక్కర్ పాలసీ రావడంతో అక్కడే పెట్టుబడులు పెట్టారు. అక్కడి వ్యాపారులు ఆసక్తి చూపకపోవడంతో ఈసారి దరఖాస్తులు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో బార్డర్ లోని ఒక్కో షాప్‌నకు వంద దరఖాస్తులు వచ్చాయి. ఈసారి గతంలో మాదిరిగా దరఖాస్తులు రాకపోవచ్చని అంటున్నారు.
చివరి మూడు రోజుల్లో పెరుగుతయ్..
లిక్కర్ షాప్‌లకు దరఖాస్తులు స్లోగా వస్తున్నాయి. శనివారంతో పాటు రానున్న చివరి మూడు రోజుల్లో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. చాలా మంది దరఖాస్తు వేసేందుకు సంప్రదిస్తున్నారు. గతం కంటే కొద్దిగా అటుఇటుగా దరఖాస్తులు వచ్చే ఛాన్స్ ఉంది.- గణపతి రెడ్డి, ఎక్సైజ్ సీఐ, గద్వాల
నాగర్‌కర్నూల్‌లో 85 దరఖాస్తులు
నాగర్ కర్నూల్ టౌన్: జిల్లాలో 67 వైన్ షాపులకు ఇప్పటి వరకు 85 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ ఆఫీసర్ గాయత్రి తెలిపారు. శనివారం 18 దరఖాస్తులు దాఖలైనట్లు ఆమె చెప్పారు. నాగర్ కర్నూల్ లో 39, తెలకపల్లిలో 6, కొల్లాపూర్ లో 7, కల్వకుర్తిలో 32, అచ్చంపేటలో ఒక దరఖాస్తు వచ్చినట్లు తెలిపారు.