
- రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో మారనున్న రాజకీయ స్వరూపం
- గత బీఆర్ఎస్ హయాంలో బీసీ రిజర్వేషన్లు 23 శాతానికి తగ్గింపు
- గత స్థానిక సంస్థల్లో 13,346 పదవులు కోల్పోయిన బీసీలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో సామాజిక న్యాయానికి నాంది పడింది. బీసీవర్గాలు సామాజికంగా, రాజకీయంగా బలోపేతం కావడంతోపాటు స్థానిక సంస్థల్లో వారికి పెద్ద సంఖ్యలో పదవులు దక్కే చాన్స్ ఉంది. లోకల్ బాడీల్లో బీసీలకు అదనంగా 23,973 పదవులు దక్కనున్నాయి. 42 శాతం రిజర్వేషన్ల ద్వారా పంచాయతీ, వార్డు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ మొదలుకొని జడ్పీ చైర్మన్ల వరకు బీసీలకు అదనంగా పదవులు లభించనున్నాయి. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను 55 వేలపై చిలుకు పదవులు వరించనున్నాయని తెలుస్తున్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించడంతో బీసీలు స్థానిక సంస్థల్లో 13,346 పదవులు కోల్పోయారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ఎన్నికల సంఘానికి గెజిట్ కాపీలు
రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన ద్వారా సేకరించిన వివరాల మేరకు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక బిల్లులు, ఆర్డినెన్స్‌లు, చట్ట సవరణలు చేసి చట్టబద్ధంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుకు కృషిచేసింది. ఆ బిల్లులు ఇంకా గవర్నర్, రాష్ట్రపతి వద్ద పెండిగ్‌లో ఉన్నాయి. అయితే, కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించినట్లుగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు తప్పని పరిస్థితిలో ప్రత్యేక జీవోను తీసుకొచ్చింది. దీనికి తగ్గట్టుగా పీఆర్‌ఆర్డీ శాఖ స్థానిక సంస్థల్లోని అన్ని పోస్టులకు అంటే.. వార్డుసభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ స్థానాలు, ఎంపీపీ అధ్యక్షులు, జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ రిజర్వేషన్ల సంబంధించి 3 గెజిట్ కాపీలు అందజేశారు.
బీఆర్ఎస్ హయాంలో బీసీలకు అన్యాయం
2019లో 12,750 జీపీలకుగానూ 2,345 సీట్లను బీసీలకు కేటాయించారు. 539 జడ్పీటీసీ స్థానాలకుగానూ 90.. 538 ఎంపీపీ స్థానాల్లో 95 బీసీలకు దక్కాయి. 5,843 ఎంపీటీసీ స్థానాలకుగానూ 1,011 బీసీలకు కేటాయించారు. 32 జడ్పీలు ఉండగా.. బీసీలకు 6 స్థానాలే కేటాయించారు. ప్రస్తుతం 13 జడ్పీలను కేటాయించగా అదనంగా 7 జడ్పీ పీఠాలు బీసీలకు దక్కాయి. అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించడం వల్ల స్థానిక సంస్థల్లో బీసీలు 13,346 పదవులు కోల్పోయారు. రిజర్వేషన్ల తగ్గింపు వల్ల 1,133 సర్పంచ్ పదవులు, గ్రామ వార్డుల్లో 11,182 పదవులు, 338 అర్బన్ వార్డు స్థానాలు, 577 ఎంపీటీసీ, 57 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు, 3 జడ్పీ చైర్మన్ల పదవులను బీసీలు కోల్పోవాల్సి వచ్చింది.
బీసీలకు పెరగనున్నte స్థానాలు..
రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లా పరిషత్‌లు ఉండగా.. బీసీలకు 13 సీట్లు కేటాయించారు. 565 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలుండగా.. 237 సీట్లు బీసీలకు దక్కే చాన్స్ ఉంది. 5,763 ఎంపీటీసీ స్థానాలకుగానూ 2,421 సీట్లలో బీసీలకు అవకాశం లభించనున్నది. 12,760 గ్రామ పంచాయతీలకుగానూ 5,359 స్థానాలు, ఇక 1,12,534 గ్రామ పంచాయతీ వార్డులకు గానూ 46,965 పదవులు, అర్బన్ వార్డుల్లో 3,385 స్థానాలకుగానూ 1,422 బీసీలకు దక్కనున్నాయి.