నిర్మల్, వెలుగు: జీరో ఎన్ రోల్మెంట్ కారణంగా మూతబడ్డ ప్రభుత్వ స్కూళ్లను తిరిగి ప్రారంభించేందుకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి జిల్లా విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు వచ్చాయి. మూతపడ్డ స్కూళ్లను ఈ విద్యా సంవత్సరం నుంచి తిరిగి ప్రారంభించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మూతపడ్డ స్కూల్స్ రీ ఓపెన్ పై వెంటనే చర్యలు ప్రారంభించాలని ఎంఈవోలు, హెడ్మాస్టర్లును డీఈవోలు ఆదేశించారు.
ఈ నేపథ్యంలోనే స్కూళ్లను రీఓపెన్ చేసే కార్యక్రమంలో ఆయా గ్రామాల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులు, అంగన్వాడీలు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ బాధ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలను భాగస్వాములను చేయనున్నారు. స్కూళ్లను తిరిగి తెరిచే విషయంలో ఆయా గ్రామాల్లో ప్రచారం చేయాలని, గ్రామస్తులకు అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లాలో గతంలో జీరో ఎన్రోల్మెంట్కారణంగా మూసేసిన 56 స్కూళ్లను తిరిగి ప్రారంభించనున్నారు.
