హైదరాబాద్ లో కరోనా వైరస్..చైనాలో 56 మంది బలి

హైదరాబాద్ లో కరోనా వైరస్..చైనాలో 56 మంది బలి
  • 1,975 మందికి సోకిన డెడ్లీ వైరస్.. 324 మంది పరిస్థితి సీరియస్ 
  • చైనా మొత్తం అలర్ట్​.. హాంకాంగ్​లో ఎమర్జెన్సీ
  • ఇండియాలో హైదరాబాదీ సహా11 మందికి ట్రీట్​మెంట్​
  • వ్యాక్సిన్​పై రెండు కంపెనీల కసరత్తులు

కరోనా వైరస్ కు బలైపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆదివారం నాటికి కొత్త కరోనా వైరస్ ధాటికి చనిపోయిన వారి సంఖ్య 56కు పెరిగింది. దాని బారిన పడిన వారి సంఖ్యా పెరుగుతోంది. దాదాపు 1,975 మందికి కరోనా వైరస్​ సోకినట్టు చైనా అధికారులు కన్ఫమ్​ చేశారు. వీరిలో 324 మంది పరిస్థితి సీరియస్ గా ఉందని వెల్లడించారు. ఈ కొత్త కరోనావైరస్ వల్ల వస్తున్న కొత్త రకం న్యుమోనియాకు ‘2019–న్యూ కరోనావైరస్ (ఎన్ సీవోవీ)’ అని పేరు పెట్టారు. ఇప్పటిదాకా 2,684 అనుమానిత కేసులు నమోదయ్యాయని చైనా నేషనల్ హెల్త్​ కమిషన్ ప్రకటించింది. వైరస్ వ్యాప్తికి కేంద్రంగా ఉన్న వుహాన్, హుబీ ప్రావిన్స్ లోని ఇతర 17 సిటీల్లోనే ఎక్కువ మంది చనిపోయారని తెలిపింది.

18 సిటీలకు రాకపోకలు బంద్‌​

ఇప్పటికే13 సిటీలకు రాకపోకలను బంద్​ పెట్టిన చైనా సర్కారు, మరో 5 సిటీలకు దానిని పొడిగించింది. దాదాపు 5.6 కోట్ల మంది నగరాల్లోనే బందీ అయిపోయారు. దేశమంతటా బస్సులు, రైళ్లు, విమానాల్లో ప్రయాణికులకు టెస్టులు చేయాలని అధికారులను ఆదేశించింది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఎయిర్​పోర్టుల్లో ఇన్​స్పెక్షన్​ స్టేషన్లు ఏర్పాటు చేయాలని, ఎవరికైనా న్యుమోనియా ఉన్నట్టు అనిపిస్తే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని నేషనల్​ హెల్త్​ కమిషన్​ వెల్లడించింది. అన్ని రవాణా శాఖలు ఎమర్జెన్సీ రెస్పాన్స్​ ప్లాన్స్​ను సిద్ధం చేయాలని సూచించింది. కాగా, పేషెంట్లకు ట్రీట్​ చేస్తున్న ఓ డాక్టర్​కూ కరోనా వైరస్​ సోకింది. లియాంగ్​ వుడాంగ్​ (62) అనే డాక్టర్​ శనివారం ఉదయం కరోనా వైరస్​తో చనిపోయారు. కరోనా వైరస్​ సోకిన తొలి డాక్టర్​ అతడేనని అధికారులు చెబుతున్నారు. డాక్టర్లు, నర్సులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కరోనా వైరస్​ బాధితులకు ట్రీట్​మెంట్​చేసేందుకు స్టాఫ్​ తక్కువపడుతుండడంతో ఆర్మీ డాక్టర్లను చైనా తీసుకొచ్చింది.

హాంకాంగ్​లో ఎమర్జెన్సీ

కరోనా వైరస్​ బీభత్సం నేపథ్యంలో హాంకాంగ్​ ఎమర్జెన్సీని ప్రకటించింది. కొత్త కేసులు నమోదు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. చైనా నుంచి రాకపోకలు బంద్​ పెట్టాలని నిర్ణయించింది. హాంకాంగ్​లో కాలుపెట్టిన వాళ్లంతా ‘హెల్త్​ డిక్లరేషన్​ ఫామ్స్​’ మీద సంతకం పెట్టేలా కొత్త రూల్​ తీసుకొచ్చింది. ఇటీవల ఆస్ట్రేలియాలో వైరస్​ సోకిన వ్యక్తిది కరోనా కేసేనని అక్కడి అధికారులు కన్ఫర్మ్​ చేశారు. నేపాల్​లోనూ ఓ కేసు నమోదైనట్టు తెలుస్తోంది. కాగా, కరోనా వైరస్​ కళ్ల నుంచి కూడా వ్యాపిస్తుందని చైనా డాక్టర్​ వాంగ్​ గ్వాంగ్ఫా చెప్పారు. కరోనా వైరస్​ సోకిన వ్యక్తి చేతులు, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కళ్లకు ఆనించినా వైరస్​ వ్యాపిస్తుందంటున్నారు. అన్ని పెట్టుకున్నా కళ్లద్దాలు పెట్టుకోకపోవడం వల్ల తనకూ వైరస్​ సోకిందని చెప్పారు.

డిస్నీలాండ్, ఓషియన్ పార్క్ బంద్ 

కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో హాంకాంగ్ లోని డిస్నీలాండ్  ఆదివారం నుంచి మూతపడింది. హాంకాంగ్ అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించిన ఒక రోజు తర్వాత డిస్నీలాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. పరిస్థితి పూర్తిగా మెరుగైన తర్వాతే డిస్నీలాండ్ ను తిరిగి ఓపెన్ చేస్తామని తెలిపింది. హాంకాంగ్ లోని ఓసియన్ పార్క్ ను మూసివేస్తున్నట్లు ఆ పార్క్ మేనేజ్ మెంట్ కూడా ప్రకటించింది.

 అడవి జంతువుల వ్యాపారంపై బ్యాన్

వుహాన్​లోని అడవి జంతువుల మాంసం అమ్మే మార్కెట్​ నుంచే కరోనా వైరస్​ వ్యాపించిందన్న వార్తల నేపథ్యంలో  దేశవ్యాప్తంగా వైల్డ్ ఏనిమల్ ట్రేడ్ ను నిషేధిస్తున్నట్లు చైనా ఆదివారం ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు విడుదలయ్యేంత వరకూ వైల్డ్ ఏనిమల్ ట్రేడ్ చేయరాదని ఆదేశించింది.

6.5 కోట్ల మంది చచ్చిపోతారా?

కరోనా ధాటికి ఏడాదిలో 6.5 కోట్ల మంది చనిపోతారని, అది వ్యాపించడానికి కొద్ది నెలల ముందే అమెరికాలోని జాన్స్​ హాప్కిన్స్​ సెంటర్​ ఫర్​ హెల్త్​ సెక్యూరిటీ సైంటిస్టులు చెప్పారట. ప్రపంచవ్యాప్తంగా సిమ్యులేషన్స్​ ద్వారా ఈ నిర్ధారణకు వచ్చినట్టు వాళ్లు చెబుతున్నారు. ప్రపంచాన్ని వణికించే కొత్త వైరస్​ కరోనా వైరసే అవుతుందని ముందే చెప్పామని సీనియర్​ సైంటిస్ట్​ డాక్టర్​ ఎరిక్​ టోనర్​ చెప్పారు.

వైరస్​ వ్యాక్సిన్​పై రెండు కంపెనీల కసరత్తులు

కరోనా వ్యాక్సిన్​ను తయారు చేసే పనిలో పడ్డాయి అమెరికాకు చెందిన రెండు కంపెనీలు. ఇనోవియో, మోడర్నా అనే కంపెనీలు, బ్రిస్బేన్​లోని యూనివర్సిటీ ఆఫ్​ క్వీన్స్​ల్యాండ్​ 3 ప్రాజెక్టులపై పనిచేస్తున్నాయి. ఆ ప్రాజెక్టులకు ఇలాంటి రోగాలకు వ్యాక్సిన్లను తయారు చేసే సంస్థలకు ఆర్థిక సాయం చేసే సెపి అనే సంస్థ ఫండ్స్​ ఇవ్వనుంది.

హైదరాబాద్‌లో సస్పెక్టెడ్కేసులు

ఫీవర్‌‌ హాస్పిటల్‌లో చేరిన నలుగురు

హైదరాబాద్, వెలుగు: నావెల్ కరోనా వైరస్ లక్షణాలతో హైదరాబాద్‌ ఫీవర్ హాస్పిటల్‌లో నలుగురు వ్యక్తులు చేరారు. వీళ్లను ఐసోలేషన్ వార్డులో డాక్టర్ల అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఇందులో ఒకరు శనివారం రాత్రి చేరగా, ముగ్గురు ఆదివారం చేరారు. శనివారం అడ్మిట్ అయిన వ్యక్తి రక్తం, ఉమ్మి ఇతర శాంపిళ్లను సేకరించి ఆదివారం తెల్లవారుజామున పుణె వైరాలజీ ల్యాబ్‌కు పంపించినట్టు దవాఖాన వర్గాలు వెల్లడించాయి.  నలుగురిలో ముగ్గురు ఇటీవలే చైనా నుంచి వచ్చిన వ్యక్తులు కావడం గమనార్హం.  ఎయిర్‌‌పోర్టులో వీరిని స్కానింగ్ చేసినప్పడు  వైరస్‌ డిటెక్ట్ అవలేదు. తర్వాత జలుబు, జ్వరం రావడంతో  హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. ఒకతను తన భార్యతో సహా హాస్పిటల్‌కు వచ్చాడు. ఆదివారం వచ్చిన ముగ్గురిలో కరోనా లక్షణాలు లేకున్నా ఇటీవల చైనా వెళ్లి రావడంతో అబ్జర్వేషన్‌లో ఉంచామని డాక్టర్లు తెలిపారు. మరోవైపు చైనాలోని వు హాన్‌లో ఎంబీబీఎస్‌ చదువుతున్న హైదరాబాద్‌ స్టూడెంట్‌ ఒకరు ఇటీవల సిటీకి వచ్చారు. అతను మూడు రోజుల కింద కరోనా లక్షణాలతో ఫీవర్‌ హాస్పీటల్‌లో చేరాడు. టెస్టుల్లో రిపోర్ట్స్‌ నెగెటివ్‌ రావడంతో శనివారం రాత్రి డిశ్చార్జ్ చేశారు. అయితే ఆయన ఫ్యామిలోని ఏడుగురిని కొద్ది రోజులు బయటకు రావొద్దని సూచించారు.  కరోనా వైరస్ భయంతో చైనాలో మెడిసిన్ చదువుతున్న మన స్టూడెంట్స్ ఇంటి బాట పడతున్నారు. ఏపీ, తెలంగాణలో 500 మంది సొంతూర్లకు చేరుకున్నారు.