సరోగసీ మహిమ.. మనవరాలికి జన్మనిచ్చిన నానమ్మ

సరోగసీ మహిమ..  మనవరాలికి జన్మనిచ్చిన నానమ్మ

అమెరికా: ఓ నాన్నమ్మ మనవరాలికి జన్మనిచ్చింది. వినడానికి వింతగా ఉన్న ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. 56 ఏళ్ల నాన్సీ తన కుమారుడు, కోడలి కోసం సరోగసీ ద్వారా ఐదో బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. జెఫ్ హాక్, కేంబ్రియా దంపతులకు నలుగురు సంతానం. అయితే వాళ్లు ఐదో సంతానం కావాలనుకున్నారు. కానీ కేంబ్రియాకు రెండు సార్లు గర్భాశయానికి సంబంధించిన ఆపరేషన్ జరగడంతో.. గర్భాశయాన్ని తొలగించాల్సి వచ్చింది. ఇక పిల్లలు పుట్టరని ఆ దంపతులు చాలా బాధపడ్డారు. అయితే సరోగసీ ద్వారా పిల్లలను కనొచ్చని ఓ డాక్టర్ సూచించాడు. డాక్టర్ మాటలకు ఆ దంపతులు ఎంతో ఆనందపడ్డారు.

సరోగసీ ద్వారా బిడ్డను కనియ్యడానికి చాలా మందిని సంప్రదించారు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ దంపతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే సరోగసీ ద్వారా బిడ్డను కనడానికి జెఫ్ హాక్ తల్లి నాన్సీ (56) ముందుకొచ్చారు.  అయితే 56 ఏళ్ల వయసులో బిడ్డను కనడం అసంభవమని ఆ దంపతులు భావించారు. కానీ వాళ్లకు వేరే అవకాశం లేకపోవడంతో ఒప్పుకున్నారు. ఏడాది తిరగక ముందే నాన్సీ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.  తమకు బిడ్డను ప్రసాదించిన నాన్సీకి కృతజ్ఞతగా ఆ బిడ్డకు వాళ్లు హన్నా అని పేరు పెట్టుకున్నారు. నాన్సీ అనే పేరు హన్నా నుంచి వచ్చిందని నాన్సీ కోడలు కేంబ్రియా తెలిపింది.