V6 News

బొగ్గు గనులపై రక్షణ పక్షోత్సవాలు..విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదం : మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ

బొగ్గు గనులపై రక్షణ పక్షోత్సవాలు..విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదం : మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసే ప్రతి ఒక్కరూ ఉత్పత్తితోపాటు రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, డ్యూటీల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇతరుల ప్రాణాలకు ముప్పువాటిల్లే ప్రమాదముందని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ అన్నారు. మంగళవారం మందమర్రి ఏరియా కల్యాణిఖని ఓపెన్​కాస్ట్​లో 56వ రక్షణ పక్షోత్సవాలు నిర్వహించారు. తనిఖీ కమిటీ కన్వీనర్, కార్పొరేట్ ​జీఎం(ఎస్టేట్) టి.లక్ష్మీపతి గౌడ్​తో కలిసి జీఎం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికారులు ఇచ్చిన సేఫ్టీ ఆపరేషన్ ప్రొసీజర్స్​ను తప్పనిసరిగా పాటించాలని, అలాచేస్తే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయన్నారు. ప్రతి ఉద్యోగి ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంస్థ బాగుంటుందని, మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. సింగరేణిలోని మొదటిసారిగా మందమర్రి ఏరియాలోని కేకే ఓసీ గనినిలో ఒక షిఫ్ట్ మొత్తం మహిళా ఉద్యోగులతో నడిపించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 

కేకే ఓసీపీ పీవో మల్లయ్య, సింగరేణి ఆఫీసర్స్​ అసోసియేషన్ ​ప్రెసిడెంట్ రమేశ్, రక్షణ కమిటీ సభ్యులు బొల్లం శ్రీనివాస్, వీరన్న, లక్ష్మీరాజు, టి.శంకర్, కేకే డిస్పెన్సరీ మెడికల్ ​సూపరింటెండెంట్ ​నాగేశ్వర్​రావు, ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఆర్కే7గనిలో... 

నస్పూర్, వెలుగు: శ్రీరాంపూర్ ఏరియాలో 56వ రక్షణ పక్షోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏరియాలోని ఆర్కే7గనిలో జరిగిన పక్షోత్సవాల కార్యక్రమంలో జీఎం ఎం.శ్రీనివాస్, రక్షణ వారోత్సవాల ఇన్​స్పెక్షన్ కమిటీ కన్వీనర్, కార్పొరేట్ జీఎం(ఎన్విరాన్​మెంట్) బి.సైదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సింగరేణి ఉద్యోగులందరూ రక్షణపై అవగాహన కలిగి ఉండాలని, విధులు నిర్వర్తిస్తున్నప్పుడు రక్షణ పరికరాలను తప్పనిసరిగా ధరించాలని సూచించారు

 శ్రీరాంపూర్ ఏరియాలో అర్కే 7 గనిలో మహిళా అధికారులు పనిచేయడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జీఎం రఘుకుమార్, ఎస్వోటు జీఎం సత్యనారాయణ, ఏఐటీయూసీ నేత బాజీసైదా, ఏరియా ఇంజనీర్ టి.రమణ రావు, గని ఏజెంట్ కుర్మా రాజేందర్, రక్షణాధికారి విజయ్ కుమార్, మేనేజర్ తిరుపతి పాల్గొన్నారు.