5జీ అప్ గ్రేడ్ పేరుతో మోసాలు

5జీ అప్ గ్రేడ్ పేరుతో మోసాలు

చాలా ఏండ్ల నిరీక్షణ తరువాత 5జీ సేవలు మన దేశంలో అందుబాటులోకి వచ్చాయి. రిలయన్స్ జియో, భారతి ఎయిర్ టెల్ మొదటి 5జీ సేవలను తీసుకొచ్చి, వినియోగదారులకు ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నాయి. దీన్ని అలుసుగా తీసుకొని కొందరు సైబర్ నేరగాళ్లు, కస్టమర్లను మోసం చేసే అవకాశం ఉంది. అప్రమత్తంగా లేకపోతే మోసగాళ్లకు చిక్కి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

‘మీ ఏరియాలో 5జీ వచ్చింది. 4జీ నుంచి 5జీకి అప్ గ్రేడ్ కావాలంటే ఈ లింక్ ని క్లి్క్ చేయండి. తరువాత మీ వివరాలు ఎంటర్ చేయండ’ని లేదా ‘టెలికాం ఆపరేటర్ని మాట్లాడుతున్నా. మీ ఫోన్ ని 5జీ ఫోన్ గా మార్చాలంటే ఓటీపీ చెప్పండ’ని, ‘ మీరు వాడుతున్న సిమ్ ని 5జీ సిమ్ కి అప్ గ్రేడ్ చేసి, కొత్త సిమ్ ఇస్తాం. ఇక్కడ వేలి ముద్ర పెట్టండ’ని, ‘ఈ సాఫ్ట్ వేర్ ఇన్టాల్ చేసుకుంటే మీ 4జీ ఫోన్ 5జీకి సపోర్ట్ చేస్తుంద’ని చెప్తూ సైబర్ నేరగాళ్లు వినియోగదారులను మోసం చేసే అవకాశం ఉంది. అయితే, టెలికాం ఆపరేటర్లు మాత్రం ‘మీ ఫోన్లో 5జీ రావాలంటే సిమ్ మార్చనవసరం లేదు. ఫోన్ 5జీ సపోర్ట్ చేస్తే సరిపోతుంది. మా నుండి ఎలాంటి కాల్స్, లింక్స్ రావు. ఏజెంట్స్ కూడా మిమ్మల్ని సంప్రదించరు. దయచేసి మోసపోకండి’ అని చెప్తున్నాయి.

ఇలా 5జీ పేరుతో వచ్చిన ఏ మెసేజ్, కాల్ కి రెస్పాండ్ అయినా, మీ బ్యాంక్ అకౌంట్స్ రిస్క్ లో పడ్డట్టే. ఫోన్లో ఉన్న పర్సనల్ డేటా అంతా నేరగాళ్ల చేతికి చిక్కినట్టే. అందుకే అప్రమత్తంగా ఉంటూ సైబర్ దాడుల బారిన పడకుండా ఉండటం చాలా అవసరం.