5జీకి మస్తు గిరాకీ.. ఈ ఏడాదే 100 కోట్ల మంది యూజర్లు

5జీకి మస్తు గిరాకీ.. ఈ ఏడాదే 100 కోట్ల మంది యూజర్లు

న్యూఢిల్లీ: మనదేశంలో 5జీ టెక్నాలజీ అందుబాటులో వస్తే యూజర్ల సంఖ్య భారీగా పెరుగుతుందని తాజా స్టడీ ఒకటి వెల్లడించింది. 4జీ మాదిరిగానే కోట్లాది మంది ఏడాదిలోనే 5జీకి మారతారని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 5జీ సబ్‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌లు 2022 చివరి నాటికి వందకోట్ల మైలురాయిని చేరుకుంటాయని అంచనా వేసింది. స్వీడిష్ టెలికాం వస్తువుల తయారీదారు ఎరిక్సన్ రిపోర్టు ప్రకారం.. భారతదేశంలో 5జీ సబ్‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌లు 2027 చివరి నాటికి 50 కోట్లకు చేరుకుంటాయి. మొత్తం యూజర్లలో ఇది 40 శాతం. మనదేశంలో 5జీ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ రెండుమూడు నెలల తరువాత అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.  ‘‘భారతదేశంలో మొత్తం మొబైల్ డేటా ట్రాఫిక్ 2021–2027 మధ్య నాలుగు రెట్లు పెరుగుతుందని అంచనా. స్మార్ట్‌‌‌‌ఫోన్ యూజర్ల సంఖ్య భారీగా పెరగడం, డేటా చౌకగా అందుబాటులోకి రావడం వంటివి ఇందుకు కారణాలు’’ అని అని ఎరిక్సన్​ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ థియావ్ సెంగ్ వివరించారు. భారతదేశంలో ప్రతి స్మార్ట్‌‌‌‌ఫోన్ సగటు డేటా ట్రాఫిక్ ప్రపంచవ్యాప్తంగా రెండోస్థానంలో ఉంది.  ఇది 2021లో నెలకు 20 జీబీ నుండి 2027లో నెలకు 50 జీబీకి పెరుగుతుందని అంచనా. డేటా ట్రాఫిక్​16 శాతం సీఏజీఆర్​తో పెరుగుతున్నది. భారతదేశంలో 5జీ కోసం వచ్చే నెల స్పెక్ట్రమ్​ వేలం నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. 2027 నాటికి 5జీ వాటా మొత్తం సబ్‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌లలో దాదాపు 40 శాతం వరకు ఉంటుందని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2027 నాటికి మొత్తం జనాభాలో మూడొంతుల మందికి 5జీ యాక్సెస్​ ఉంటుందని అంచనా.   

అమెరికా నంబర్​ వన్​..

అమెరికాలో 2027 నాటికి  ప్రతి పది సబ్‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌లలో తొమ్మిదింటికి 5జీ ఉంటుంది. రాబోయే ఐదేళ్లలో ఈ ప్రాంతం 5జీ సబ్‌‌‌‌స్క్రిప్షన్ల విషయంలో వరల్డ్​ లీడర్​గా ఎదుగుతుంది.  ఈ సర్వేలో పాల్గొన్న భారతీయ సంస్థలలో సగానికి పైగా (52 శాతం) రాబోయే 12 నెలల్లో 5జీని ఉపయోగించాలని అనుకుంటున్నాయి. మరో 31 శాతం మంది 2024 నాటికి 5జీని ఉపయోగిస్తామని అన్నారు. 5జీ వస్తే బిజినెస్​లకు ఎంతో మేలు జరుగుతుందని సర్వేలో పాల్గొన్న 326 బిజినెస్ ఎగ్జిక్యూటివ్​లు వెల్లడించారు.  ఈ టెక్నాలజీ వల్ల భారతదేశ టెలికాం మార్కెట్ మరింత ఎదుగుతుంది. మెరుగైన కంటెంట్ స్ట్రీమింగ్, రియల్​టైం వీడియో ఎనలిటిక్స్​, అటానమస్​ వెహికల్స్​, డ్రోన్‌‌‌‌లకు 5జీ ఎంతో ఉపయోగపడుతుంది.  యూరప్​, గల్ఫ్​, ఈశాన్య ఆసియాలో 5జీ వేగంగా వ్యాపిస్తుంది.  ప్రపంచ జనాభాలో దాదాపు నాలుగింట ఒక వంతు మంది ప్రస్తుతం 5జీ వాడుతున్నారు. 2022 మొదటి క్వార్టర్​లోనే ఏడు కోట్ల 5జీ సబ్‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌లు వచ్చాయి. భారతీయ ఆపరేటర్లు 4జీ కంటే 10 రెట్లు వేగంతో 5జీ ద్వారా డేటా సేవలను అందించే అవకాశం ఉంది.  ఇండియాలో మొత్తం మొబైల్ సబ్‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌లలో 4జీ టెక్నాలజీ 68 శాతం ఉండగా, 2027లో ఇది 55 శాతానికి తగ్గుతుంది.