వజ్రోత్సవాల్లో భాగంగా సీసీసీ వద్ద 5కె రన్

వజ్రోత్సవాల్లో భాగంగా సీసీసీ వద్ద 5కె రన్

స్వాతంత్ర్య  వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో 5 కె రన్ నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి ప్రారంభమైన ఈ రన్ లో హోమ్ మంత్రి మొహమూద్ అలీ, మంత్రి తలసాని, సీఎస్ సోమేశ్ కుమార్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.... బంగారు తెలంగాణ సాధించే దిశగా చర్యలు చేపడుతున్నామని అన్నారు. శాంతి యుతంగా పోరాడి గాంధీ స్వాతంత్ర్యం తీసుకువచ్చారని, ఆగస్టు 15 వ తేదీన ఇంటింటా జాతీయ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. 5 కె రన్ లో విద్యార్థులు పాల్గొనడం అభినందనీయమన్న హోం మంత్రి... యువత తెల్లవారుజామున లేచి వ్యాయామాలు చేయడం చాలా మంచిదని చెప్పారు. ఈ రోజు కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర జరుగుతున్న ఈ ప్రోగ్రాం పండుగలా ఉందని చెప్పుకొచ్చారు.

ఎందరో మహానుభావులు త్యాగం చేస్తే స్వాతంత్రం వచ్చిందని మంత్రి తలసాని వ్యాఖ్యానించారు. ఈ రోజు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామంటే వారి త్యాగాల ఫలమేనని చెప్పారు. చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం యువతకు ఉందన్న తలసాని... ఆహ్లాదకరమైన వాతావరణంలో 5కే రన్ ను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఆగస్టు 8 వ తేదీ నుండి 22 వరకు ఈ వేడుకలు కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు.

స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తిని మనం ఇలాగే కొనసాగించాలని సీఎస్ సోమేశ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ ఆనంద్ కూడా పలు కామెంట్లు చేశారు. అందులో భాగంగా డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. మహాత్మా గాంధీ తో పాటు మన తాతల తరాల వారు కూడా స్వాతంత్ర్యం కోసం పోరాడారని తెలిపారు. ఇక ఈ సెలబ్రేషన్స్ 15 వ తేదీ వరకు కొనసాగుతాయని సీపీ స్పష్టం చేశారు.