తెలంగాణలో 60 జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్నం : సేవాలాల్ సేన

 తెలంగాణలో 60 జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్నం   :   సేవాలాల్ సేన

బషీర్ బాగ్, వెలుగు:  ప్రజల్లో ఓటుపై అవగాహన కల్పించి ప్రధాన రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పేందుకు తమకున్న రిజర్వేషన్ స్థానాల్లో కాకుండా జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఆంగోత్ రాంబాబు తెలిపారు. ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ సాధించుకుంటే తమ జీవన స్థితిగతుల్లో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మొదటి విడత అభ్యర్థుల జాబితాను ఆదివారం విడుదల చేసి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 60 స్థానాల్లో తమ అభ్యర్థులు బరిలో ఉంటారని తెలిపారు. ప్రధాన రాజకీయ పార్టీలు తమ సంక్షేమాన్ని విస్మరించాయని ఆరోపించారు.  

సంక్షేమ పథకాలపై పెట్టిన శ్రద్ధ, విద్య, వైద్యం, ఉపాధి అంశాలపై పెట్టలేదని విమర్శించారు. అధికార బీఆర్ఎస్ పార్టీ తమకు దక్కాల్సిన రాజ్యాంగ హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు.  గెలవకపోయినా తమను విస్మరించిన పార్టీలను ఓడిస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం 25 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.