ఒకే స్కూల్‌లో 60 మంది స్టూడెంట్స్‌కు కరోనా

ఒకే స్కూల్‌లో 60 మంది స్టూడెంట్స్‌కు కరోనా

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఉన్న శ్రీ చైతన్య గాల్స్ రెసిడెన్షియల్ స్కూల్‌లో 60 మంది స్టూడెంట్స్‌కు కరోనా సోకింది. ఆదివారం నాడు ఒక స్టూడెంట్‌కు డయేరియా, వాంతులు, జ్వరం రావడంతో టీచర్లు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. కరోనా టెస్టు చేశారు. ఆ స్టూడెంట్‌కు పాజిటివ్ రావడంతో ఆ స్కూల్‌లో చదువుతున్న మొత్తం 480 మంది స్టూడెంట్స్, 57 మంది స్టాఫ్‌కు టెస్టులు చేశారు. దీంతో 60 మంది స్టూడెంట్స్‌కు వైరస్ సోకినట్లు తేలింది. అయితే అందులో ఒక స్టూడెంట్‌కు లక్షణాలు ఎక్కువగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. మరో స్టూడెంట్‌ను ఇంట్లో క్వారంటైన్ చేయగా.. మిగిలిన 58 మందిని హాస్టల్‌లోనే క్వారంటైన్‌లో ఉంచారు. 

ఇంత భారీ సంఖ్యలో విద్యార్థులకు కరోనా సోకడంతో స్కూల్‌ను అక్టోబర్ 20 వరకూ మూసేయాలని ఆదేశించినట్లు బెంగళూరు అర్బన్ డిప్యూటీ కమిషనర్ జే మంజునాథ్ తెలిపారు. బల్లారికి చెందిన ఒక స్టూడెంట్‌కు డయేరియా, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్‌ వచ్చిందని, దీంతో స్కూల్‌లో ప్రతి ఒక్కరినీ టెస్ట్ చేశామని ఆయన చెప్పారు. అందులో 60 మందికి కరోనా పాజిటివ్ రాగా, వారిలో 14 మంది తమిళనాడుకు చెందిన వారు ఉన్నారని, మిగిలిన వాళ్లంతా కర్ణాటకలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారని అన్నారు. స్కూల్‌లో అందరికీ మళ్లీ ఏడు రోజుల తర్వాత టెస్టులు చేస్తామని తెలిపారు.