
- వచ్చే ఏడాది ముగియనున్నపదవీ కాలం
- ఈసీ రెడీగా ఉన్నా.. అనుమతివ్వని సర్కారు
- ప్రభుత్వ తీరుపై ప్రజల ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఖాళీ అవుతున్న స్థానిక సంస్థల సీట్ల భర్తీని సర్కారు పట్టించుకోవడం లేదు. మూడేండ్ల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, వార్డు మెంబర్ల ఖాళీల సంఖ్య 6 వేలు దాటింది. వీటికి ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన లేదని ఈసీ అధికారులు చెప్తున్నారు.
ములుగు జడ్పీ చైర్మన్, ఆదిలాబాద్ వైస్ చైర్మన్ మృతి
ఆదిలాబాద్ జడ్పీ వైస్ చైర్మన్ ఆరె రాజన్న 2020లో కరోనాతో మృతి చెందారు. ఆ స్థానంలో మూడేండ్ల నుంచి ఎలక్షన్ నిర్వహించడం లేదు. ఇటీవల ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ గుండె పోటుతో మరణించారు. వీటితో పాటు రాష్ట్రంలో నాలుగు జడ్పీటీసీ, ఆరు ఎంపీపీ , 95 ఎంపీటీసీ, 229 సర్పంచ్, 344 ఉప సర్పంచ్, 5,428 వార్డు మెంబర్ స్థానాలు ఖాళీగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు.
వచ్చే ఏడాది టర్మ్ పూర్తి
రాష్ట్రంలో లోకల్ బాడీల టర్మ్ వచ్చే ఏడాది పూర్తికానుంది. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గత మూడేండ్ల నుంచి ప్రభుత్వ తీరుపై పబ్లిక్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తే.. ఫలితాలు అధికార పార్టీకి వ్యతిరేకంగా వస్తే ఆ ప్రభావం అసెంబ్లీ రిజల్ట్స్ పై ఉంటుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అందుకే ఎన్నికలకు అనుమతి ఇవ్వడం లేదని పార్టీలో చర్చ జరుగుతున్నది.
కోర్టు నోటీసులు ఇచ్చినా స్పందించని సర్కారు
లోకల్ బాడీల్లో ఖాళీ సీట్లపై ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదని అడ్వకేట్ రాపోలు భాస్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీజే ఉజ్జల్ భుయాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ మార్చిలో విచారణ జరిపి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ కు వాయిదా వేశారు. అయితే, ఏప్రిల్ లో అధికారులు విచారణకు గైర్హాజరయ్యారు. ఆ తర్వాత కోర్టుకు వేసవి సెలవులు ఇచ్చారు. ఈ నెల 11న హైకోర్టులో చీఫ్ జస్టిస్ బెంచ్ మళ్లీ విచారణ జరపగా.. పంచాయతీ రాజ్ డైరెక్టర్ హనుమంతరావు హాజరై వివరణ ఇచ్చారు. ఎన్నికల నిర్వహణ అంశం ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉందని చెప్పారు. దీంతో సీజే బెంచ్ విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.
ALSO READ:కృష్ణా తీరం వెంట .. రాళ్లు,మట్టి కుప్పలు
ఎన్నికలు నిర్వహించాలే..
ఎంతో కాలంగా లోకల్ బాడీ సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటికి తొందరగా ఎలక్షన్స్ నిర్వహించాలి. వచ్చే ఏడాది మా టర్మ్ ముగుస్తుంది. అందరం తమ ఏరియాలు డెవలప్ చేసుకోవాలని ఎన్నికల్లో గెలిచాం. గతంలో ఎప్పుడూ ఇంత లాంగ్ టైమ్ సీట్లు ఖాళీగా లేవు. ఎన్నికలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి.
- కరీంనగర్ జిల్లా కు చెందిన అధికార పార్టీ ఎంపీపీ
లోకల్ బాడీలపై రాష్ట్ర సర్కారుకు చిన్న చూపు
లోకల్ బాడీల్లో వార్డు మెంబర్, సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ చైర్మన్ ల పాత్ర కీలకం. ఎమ్మెల్యేలు, ఎంపీలు చనిపోతే 6 నెలల్లో ఎలక్షన్ నిర్వహిస్తున్నరు. లోకల్ బాడీ సీట్లకు మాత్రం నిర్వహించడం లేదు. దీంతో స్థానిక సంస్థలపై ప్రభుత్వానికి చిన్న చూపు ఉందని అర్థమవుతోంది. దీనిపై పార్లమెంట్ లో చట్టం తీసుకురావాలి. సీటు ఖాళీ అయిన ఆరు నెలలు లేదా కొంత టైమ్ లో ఎన్నికలు నిర్వహించేలా చట్టం తెచ్చి అమలు చేయాలి.
- సత్యనారాయణ రెడ్డి, పంచాయతీ రాజ్ చాంబర్ స్టేట్ ప్రెసిడెంట్