61 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు ఎక్స్ కేటగిరీ భద్రత

61 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు ఎక్స్ కేటగిరీ భద్రత

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్​లో 61 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు ఎక్స్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించేందుకు కేంద్ర హోంశాఖ సోమవారం ఆమోదించింది. వీరికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) సిబ్బందితో సెక్యూరిటీ కల్పించనున్నారు. బెంగాల్​లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ నేతలపై జరిగిన దాడులు, హింసలో 9 మంది పార్టీ వర్కర్లు మరణించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఎక్స్ కేటగిరీలో 3 నుంచి ఐదుగురు గన్​మెన్లు 24 గంటలూ భద్రత కల్పిస్తారు. ఎన్నికల తర్వాత హింస జరగడంతో కేంద్ర హోంశాఖ నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక టీంను బెంగాల్​ పంపింది. ఈ టీమ్​, సెక్యూరిటీ ఏజెన్సీల రిపోర్టులను పరిశీలించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

మొత్తం 77 మందికి.. 

కేంద్రం తాజాగా ఆమోదం తెలిపినవారితో సహా బెంగాల్ లో ఎక్స్ కేటగిరీ సెక్యూరిటీ పొందిన బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 77కు చేరింది. బెంగాల్ బీజేపీ ఎల్పీ నేత సువేందు అధికారికి ఇంతకుముందు నుంచే సీఆర్పీఎఫ్ జవాన్లతో జడ్ కేటగిరీ భద్రత కొనసాగుతోంది. మరో నలుగురు బీజేపీ నేతలకు వై కేటగిరీ సెక్యూరిటీ ఉంది. 

చర్యలు తీసుకుంటాం: బెంగాల్ సర్కార్ 

రాష్ట్రంలో మే 9 తర్వాత ఎలాంటి రాజకీయ హింస జరగలేదని బెంగాల్ ప్రభుత్వం సోమవారం కలకత్తా హైకోర్టుకు చెప్పింది. భవిష్యత్తులో శాంతి నెలకొనేలా అన్ని చర్యలూ తీసుకుంటామని తెలిపింది. ఎన్నికల రిజల్ట్స్ తర్వాత హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయని దాఖలైన పిల్​పై విచారణలో భాగంగా ప్రభుత్వం హైకోర్టుకు వివరణ ఇచ్చింది.