168 ఎస్సై పోస్టులకు  63,439 మంది మహిళల పోటీ

168 ఎస్సై పోస్టులకు  63,439 మంది మహిళల పోటీ

హైదరాబాద్‌‌, వెలుగు: పోలీస్‌‌ పోస్టులకు మహిళా అభ్యర్థులు భారీగా పోటీ పడుతున్నారు. విమెన్స్‌‌ కోటాలో 33% పోస్టులను దక్కించుకునేందుకు లక్షల మంది పరీక్షలు రాస్తున్నారు. పోలీస్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌లో ఎస్సై, కానిస్టేబుల్‌‌ ఉద్యోగాలకు ఫస్ట్ ప్రయారిటీ.. జైల్‌‌ వార్డర్‌‌‌‌కి సెకండ్ ప్రయారిటీ ఇస్తున్నారు. తెలంగాణ స్టేట్‌‌ లెవల్‌‌ పోలీస్ రిక్రూట్‌‌మెంట్‌‌ బోర్డు(టీఎస్‌‌ఎల్‌‌పీఆర్‌‌‌‌బీ) ద్వారా17,516 పోస్టులు భర్తీ కానుండగా, మొత్తం 7,33,559 మంది అభ్యర్థుల నుంచి 12,91,006 అప్లికేషన్లు వచ్చాయి. 

587 ఎస్సై స్థాయి పోస్టులు 

పోలీస్‌‌, ఫైర్‌‌‌‌ సర్వీసెస్‌‌, ఎస్‌‌పీఎఫ్‌‌, జైళ్ల శాఖలో మొత్తం 587 ఎస్సై స్థాయి పోస్టులు ఉన్నాయి. వీటిలో రిజర్వేషన్‌‌ ప్రకారం168 పోస్టులు విమెన్‌‌ కోటాకు వర్తిస్తాయి. దీంతో ఒక్కో పోస్టుకు 378 మంది మహిళలు పోటీలో నిలిచారు. సివిల్‌‌, ఏఆర్‌‌‌‌, ఎస్‌‌పీఎఫ్‌‌ ఎస్సై స్థాయి పోస్టులకు మహిళా అభ్యర్థుల నుంచి భారీగా అప్లికేషన్లు వచ్చాయి. ఎస్సై పోస్టులకు 2,47,630 అప్లికేషన్లు రాగా.. ఇందులో 63,439 మంది మహిళలు ఉన్నారు. మూడు విభాగాల్లో 16,929 కానిస్టేబుల్ పోస్టులు ఉండగా, విమెన్ కోటా కింద 5,586 పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ పోస్టులకు మొత్తం 1,79,764 మంది మహిళలు అప్లై చేసుకున్నారు. వీటిలో 614 ఎక్సైజ్‌‌, 63 ట్రాన్స్‌‌పోర్ట్‌‌ కానిస్టేబుల్ పోస్టులు మహిళలకు దక్కనున్నాయి. 

జిల్లాలవారీగా అప్లికేషన్లు ఇలా.. 

అప్లికేషన్‌‌ డేట్‌‌ ముగియడంతో అభ్యర్థుల డేటాను టీఎస్‌‌ఎల్‌‌పీఆర్‌‌బీ‌‌ సెంట్రలైజ్‌‌ చేసింది. జిల్లాల వారీగా అభ్యర్థుల వివరాలు పరిశీలించింది. ఇందులో హైదరాబాద్‌‌ నుంచి అత్యధికంగా 5,655 మంది ఎస్సై పోస్టులకు,15,410 మంది కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి ఎస్సై పోస్టులకు 4,902, కానిస్టేబుల్ పోస్టులకు17,429 మంది మహిళలు దరఖాస్తు చేకున్నారు. అతి తక్కువగా కుమ్రంభీం అసిఫాబాద్‌‌ జిల్లా నుంచి 509 మంది ఎస్సై పోస్టులకు, 2,545 మంది కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేసుకున్నారు.