ఇంజనీరింగ్ కొత్త కోర్సులు డీలా.. 12,016 సీట్లకు 6,370 సీట్లు ఖాళీ

ఇంజనీరింగ్ కొత్త కోర్సులు డీలా.. 12,016 సీట్లకు 6,370 సీట్లు ఖాళీ
  • ఆరు కోర్సుల్లో 12,016 సీట్లకు 6,370 సీట్లు ఖాళీ
  • అవగాహన లేకే అంటున్న ఆఫీసర్లు, మేనేజ్‌‌మెంట్లు 
  • కొత్త కోర్సులు అందిస్తున్న కాలేజీల్లో ఆందోళన

హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఈ ఏడాది తీసుకొచ్చిన కొత్త కోర్సులకు ఫుల్ డిమాండ్ ఉంటుందని అనుకున్నా, అంచనాలు నిజం కాలేదు. ఆరు కొత్త కోర్సుల్లో సగం సీట్లు కూడా నిండలేదు. కొత్త కోర్సులపై విద్యాశాఖ పెద్దగా ప్రచారం చేయకపోవడంతోనే ఇలా జరిగిందని కాలేజీల మేనేజ్‌‌మెంట్లు ఆరోపిస్తున్నాయి. రాష్ర్టంలో మొత్తం178 ఇంజనీరింగ్ కాలేజీలుండగా, 70,135 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్​ఫేజ్​లో కేవలం 50,137 సీట్లు భర్తీ కాగా,  19,998 సీట్లు మిగిలిపోయాయి. భర్తీ అయిన సీట్లలో 38 వేల మంది స్టూడెంట్స్‌‌ మాత్రమే కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. 2020–21 విద్యాసంవత్సరంలో ఇంజనీరింగ్​లో ఆరు కొత్త కోర్సులకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఆర్టిఫిషియల్‌‌ ఇంటెలిజెన్స్‌‌ అండ్ మెషీన్‌‌ లెర్నింగ్ (ఏఐ అండ్ ఎంఎల్), డేటా సైన్స్, సైబర్‌‌ సెక్యూరిటీ, ఇంటర్నెట్‌‌ ఆఫ్‌‌ థింగ్స్ (ఐఓటీ), నెట్ వర్క్స్, సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ కోర్సులు మొదలయ్యాయి. ఈ ఏడాది చాలా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఈ కొత్త కోర్సులకు ఫుల్ డిమాండ్ ఉంటుందని అంచనా వేశాయి. పలు పాత కోర్సుల సీట్లను తగ్గించుకొని, కొత్త కోర్సుల్లో సీట్లకు పర్మిషన్ పొందాయి.  ఆరు కోర్సుల్లో 12,016 సీట్లకు జేఎన్టీయూ పర్మిషన్ ఇవ్వగా, ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్​లో కేవలం 5,646 సీట్లే భర్తీ అయ్యాయి. మిగతా 6,370 సీట్లు మిగిలిపోయాయి. ఆర్టిఫిషియల్‌‌ ఇంటెలిజెన్స్‌‌ అండ్ మెషీన్‌‌ లెర్నింగ్ (ఏఐ అండ్ ఎంఎల్)లో 51 శాతం సీట్లు, డేటా సైన్స్​లో 47శాతం సీట్లే భర్తీ అయ్యాయి. సైబర్ సెక్యూరిటీ కోర్సులో 51శాతం, ఐఓటీలో 31శాతం, నెట్ వర్క్స్​లో 55 శాతం, సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్​లో కేవలం11శాతం సీట్లే నిండాయి. దీంతో కాలేజీల మేనేజ్‌‌మెంట్లు ఇప్పుడు తలలు పట్టుకున్నాయి.

ఎందుకిలా అంటే…

ఇంజనీరింగ్​ కొత్త కోర్సుల్లో సీట్లు భర్తీ కాకపోవడంపై కాలేజీల మేనేజ్‌‌మెంట్లలో, జేఎన్టీయూ వర్సిటీ ఆఫీసర్లలోనూ అయోమయం నెలకొంది.  సగం సీట్లు కూడా నిండకపోవడంతో, ఎందుకు ఇలా జరిగిందనే దానిపై చర్చిస్తున్నారు. కొత్త కోర్సులపై స్టూడెంట్స్‌‌కు అవగాహన కల్పించకపోవడమే ఈ పరిస్థితి కారణమని మేనేజ్‌‌మెంట్లు భావిస్తున్నాయి. ఉన్నత విద్యామండలి గానీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు గానీ ఆయా కోర్సులపై పెద్దగా ప్రచారం చేయలేదని విమర్శిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఆయా డిపార్ట్​మెంట్ల ఆఫీసర్ల దృష్టికి తీసుకుకెళ్లారు కూడా.  పాత కోర్సులైన  సీఎస్ఈలో 16,858 సీట్లుండగా, 16,048 సీట్లు(95శాతం), ఐటీలో 4,734 సీట్లకు 4,625(98శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. మిగిలిన పలు కోర్సుల్లోనూ సగానికిపైగా భర్తీ అయ్యాయి. ఆయా కోర్సులపై స్టూడెంట్స్‌‌కు అవగాహన ఉండబట్టే సీట్లు భర్తీ అయ్యాయని మేనేజ్‌‌మెంట్లు చెప్తున్నాయి. కాబట్టి విద్యాశాఖ వెంటనే ఇంజనీరింగ్ కొత్త కోర్సులపై ప్రచారం మొదలుపెట్టాలని  కోరుతున్నారు.

కొత్త కోర్సుల్లో సీట్ల భర్తీ ఇలా

కోర్సు                                      సీట్లు           నిండింది         ఖాళీ        భర్తీ శాతం

ఏఐ అండ్ ఎంఎల్                        5,364        2,712        2,652         51

డేటా సైన్స్                                 3,197        1,504        1,693         47

సైబర్ సెక్యూరిటీ                          1,842         946         896            51

ఐఓటీ                                       1,277         392         885            31

సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్                    210            23          187             11

నెట్ వర్క్స్                                 126            69           57              55

మొత్తం                                   12,016        5,646      6,370          46.9