
వాషింగ్టన్: ప్రపంచ చిప్ తయారీ రంగంలో చైనాను అధిగమించే లక్ష్యంతో అమెరికా ప్రభుత్వం ఇంటెల్ కార్పొరేషన్‌లో వాటాలు దక్కించుకోవాలని చూస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇంటెల్ సీఈఓతో చర్చలు కూడా జరిపారు. ఇంటెల్ సీఈఓ రాజీనామా చేయాలని సోషల్ మీడియాలో ట్రంప్ వరుస పోస్ట్‌లు పెట్టడం ద్వారా ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.
విశ్లేషకులు ఈ పరిణామాన్ని 'మన్‌హటన్ ప్రాజెక్ట్'తో పోలుస్తున్నారు. ఇది అమెరికా భద్రతకు అత్యంత కీలకమైన అంశంగా మారింది. తైవాన్ ప్రస్తుతం ప్రపంచ చిప్ మార్కెట్‌లో 60% పైగా వాటాను కలిగిఉంది. తైవాన్ పై అధికంగా ఆధారపడటం అమెరికా భద్రతకు ముప్పుగా ట్రంప్ భావిస్తున్నారు. ఇంటెల్ కంపెనీ అధునాతన సెమికండక్టర్ల తయారీలో సామర్థ్యం కలిగి ఉండటంతో అందులో వాటాలు దక్కించుకోవడం ద్వారా విదేశీ చిప్‌లపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని అమెరికా భావిస్తోంది.
ప్రస్తుతం ఈ చర్చలు కొనసాగుతున్నప్పటికీ తుది ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు. ఈ ఒప్పందం ద్వారా అమెరికా తన సాంకేతిక సార్వభౌమత్వాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.