ట్రేడ్‌‌‌‌ డీల్‌‌‌‌పై రాహుల్‌‌‌‌ వి అబద్ధాలు...కాంగ్రెస్‌‌‌‌ ఆరోపణలు నవ్వు తెప్పించేలా ఉన్నాయి: అమిత్‌‌‌‌ షా

ట్రేడ్‌‌‌‌ డీల్‌‌‌‌పై రాహుల్‌‌‌‌ వి అబద్ధాలు...కాంగ్రెస్‌‌‌‌ ఆరోపణలు నవ్వు తెప్పించేలా ఉన్నాయి: అమిత్‌‌‌‌ షా

గాంధీనగర్‌‌‌‌‌‌‌‌: అమెరికా, యూకే, ఈయూలతో ఇండియా చేసుకున్న ట్రేడ్‌‌‌‌ డీల్‌‌‌‌పై కాంగ్రెస్‌‌‌‌ నాయకుడు రాహుల్‌‌‌‌ గాంధీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌‌‌‌ షా మండిపడ్డారు. వాణిజ్య ఒప్పందాలు భారత రైతులకు హాని కలిగిస్తాయని కాంగ్రెస్‌‌‌‌  చేస్తున్న ఆరోపణలు నవ్వు తెప్పించేవిగా ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం, పాడి పరిశ్రమలను పూర్తిగా రక్షిస్తున్నదని ఆయన స్పష్టం చేశారు. ‘‘రైతులను రక్షించడం గురించి రాహుల్‌‌‌‌ గాంధీ పార్లమెంట్‌‌‌‌లో మాట్లాడినప్పుడు నాకు నవ్వాలనిపించింది. 

దేశాన్ని తప్పుదారి పట్టించడంలో కాంగ్రెస్‌‌‌‌కు ఒక చరిత్ర ఉంది. అలాంటి వారు ఇప్పుడు ట్రేడ్‌‌‌‌ డీల్స్ గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు” అని మండిపడ్డారు. ప్రతి ఒప్పందంలోనూ దేశ రైతుల ప్రయోజనాలను కాపాడేలా ప్రధాని మోదీ నిర్ణయాలు ఉన్నాయన్నారు. దేశంలోని రైతులు, పాడి పరిశ్రమ, మత్స్యకారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి హామీ ఇస్తున్నామన్నారు. ట్రేడ్‌‌‌‌ డీల్‌‌‌‌పై బహిరంగ చర్చకు తాను సిద్ధమని, ప్లేస్‌‌‌‌ చెబితే వస్తానని రాహుల్‌‌‌‌ గాంధీకి అమిత్‌‌‌‌ షా సవాల్‌‌‌‌ చేశారు. 

తాము పాడి పరిశ్రమను బలహీనపర్చలేదని, విస్తరించే వ్యక్తులమన్నారు. అమెరికా, యూకే, ఈయూలతో ట్రేడ్‌‌‌‌ డీల్‌‌‌‌ ద్వారా మన వ్యవసాయ, మత్స్యకారుల ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్‌‌‌‌లోకి ప్రవేశిస్తాయని తెలిపారు. అదే సమయంలో రైతుల ప్రయోజనాలనూ రక్షిస్తామన్నారు. ప్రధాని మోదీ రైతుల ప్రయోజనాలతో ఎప్పుడూ రాజీపడలేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌‌‌‌ ‘గరీబీ హటావో’ గురించి మాట్లాడిందని, కానీ, పేదరిక నిర్మూలనకు కచ్చితమైన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని విమర్శించారు.