రిపేర్లతో కడెం ప్రాజెక్టు సేఫ్

రిపేర్లతో కడెం ప్రాజెక్టు సేఫ్

నిర్మల్,  వెలుగు:  కడెం ప్రాజెక్టు గేట్లకు రిపేర్లు చేపట్టడంతో మంచి ఫలితాలనిస్తోంది.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటి ఇన్‌చార్జి మం త్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు  కడెం ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టి నిధులను విడుదల చేశారు. ప్రాజెక్టు సంబంధించిన  రిపేర్లను  నిర్దేశిత గడువులో పూర్తి చేయించారు. మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు శనివారం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.  

2 లక్షల క్యూసెక్కుల వరకు వరద నీరు రావడంతో అధికారులు ప్రాజెక్టు మొత్తం 18  గేట్లను పైకెత్తి 2,14,730 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.  వరద ఉధృతిని లెక్క  కట్టేందుకు సెన్సార్లు ఏర్పాటు చేశారు.  పలు చోట్ల రెయిన్ గేజ్  స్టేషన్ లను ఏర్పాటు చేయడంతో ఎగువన కురుస్తున్న వర్షం లెక్కలతో పాటు వరద ఉధృతిని అంచనా వేసే అవకాశం ఏర్పడింది. 

2022 లో ప్రాజెక్టుకు త్రుటిలో తప్పిన  ప్రమాదం 

2022 లో ఎగువ నుంచి భారీగా వరద రాగా..  గేట్లు పైకి లేవకపోవడం, ఓ గేటు కూడా వరదలో కొట్టుకుపో వడంతో దాదాపు ఆరు లక్షల క్యూసెక్కుల నీరును దిగువకు విడుదల చేయడం కష్టమైంది.  వరద నీరు ప్రాజెక్టు పై నుంచి ప్రవహించి ఓ దశలో ప్రాజెక్టు కొట్టుకుపోతుందోనేమోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.

  దీంతో 14  గ్రామాలకు ముంపు తప్పదని భావించారు. ప్రజలను  పునరావాస కేంద్రాలకు కూడా తరలించారు.  కడెం ప్రాజెక్టు గేట్లకు రిపేర్లు పూర్తి కావడంతో ఈసారి మొత్తం 18 గేట్లు ఓపెన్ అయ్యాయి.  2 లక్షల క్యూసెక్కుల వరద నీటిని ఈజీగా దిగువకు విడుదల వదులుతున్నారు