జీఎస్టీ చెల్లించలేదంటూ 28 మంది వ్యాపారులకు 66 కోట్ల పెనాల్టీ

జీఎస్టీ చెల్లించలేదంటూ 28 మంది వ్యాపారులకు 66 కోట్ల పెనాల్టీ
  • పత్తి రైతులు ఆగం
  • నిరసనగా ఖమ్మం మార్కెట్ బంద్​ చేసిన ట్రేడర్లు
  • ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయని ఆఫీసర్లు

ఖమ్మం/ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం పత్తి మార్కెట్లో ట్రేడర్ల ఇష్టారాజ్యం నడుస్తోంది. కొంతమంది ట్రేడర్లకు జీఎస్టీ చెల్లింపులకు సంబంధించి అధికారులు నోటీసులు జారీ చేశారని.. ఈ వారం మొత్తం మార్కెట్లో పత్తి కొనుగోళ్లు నిలిపివేశారు. రైతుల ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన మార్కెట్ కమిటీ పాలకవర్గం, మార్కెటింగ్ శాఖ అధికారులు పూర్తిగా ట్రేడర్లకు అనుకూలంగా వ్యవహరించడంపై రైతులు, రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పత్తి కొనుగోళ్ల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా, వ్యాపారులు చెప్పిందే వేదంగా కార్యకలాపాలు బంద్ చేయడం వల్ల రైతులతో పాటు, మార్కెట్లో పనిచేసే కార్మికులు, దడువాయిలు, మహిళా కూలీలు సహా వందలాది మంది చిరు వ్యాపారులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. 

మూడేళ్ల క్రితం జీఎస్టీ చెల్లించలేదని..

ఖమ్మం మార్కెట్లో ఉన్న 28 మంది ట్రేడర్లు 2017–18, 2018–19 సంవత్సరానికి సంబంధించి జీఎస్టీ రూ.33 కోట్లు చెల్లించలేదంటూ ఆ డిపార్ట్ మెంట్ అధికారులు ఇటీవల నోటీసులు ఇచ్చారు. అసలు రూ.33 కోట్లకు 100 శాతం పెనాల్టీ కలిపి రూ.66 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తాము గతంలోనే జీఎస్టీ చెల్లించామని, కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల ఇంత మొత్తం భారం వేశారని వ్యాపారులు అంటున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ చాంబర్ ఆఫ్ కామర్స్ కు సంబంధించిన ప్రతినిధులు మార్కెట్ అధికారులకు సమస్యను వివరించి రెండ్రోజుల పాటు కొనుగోళ్లు నిలిపివేస్తామని చెప్పారు. ఆ తర్వాత రాష్ట్ర మంత్రులతో చర్చిస్తున్నామంటూ కొనుగోళ్ల నిలిపివేతను మరో ఐదు రోజుల పాటు కంటిన్యూ చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి కొనుగోళ్లు జరిగేలా చూడాల్సిన మార్కెటింగ్ అధికారులు ట్రేడర్లకే ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. దీనివల్ల నష్టపోయిన కమీషన్ దారులు కొందరు మార్కెటింగ్ ఆఫీసర్లకు ఎదురు తిరిగారు. తమకు ట్రేడింగ్ లైసెన్స్ ఉందని, మార్కెట్లో కొనుగోళ్లు చేయిస్తే తాము పత్తి కొంటామంటూ ముందుకు వచ్చినా అధికారులు మాత్రం పట్టించుకోలేదు. ఇటీవలి కాలంలో ఖమ్మం మార్కెట్ కు రెగ్యులర్ గా కనీసం 15 వేల నుంచి 20 వేల బస్తాల వరకు పత్తి అమ్మకానికి వస్తోంది. ట్రేడర్ల సమ్మె కారణంగా రోజుకు రూ.2 కోట్ల టర్నోవర్ జరిగే మార్కెట్ ఆదాయానికి గండి పడుతోంది. సమ్మె చేస్తున్న ట్రేడర్లకు కనీసం షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు కూడా ఆఫీసర్లు భయపడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.   

హాస్పిటల్​కు వెళ్లాలని..

ఇటీవల నాకు రోడ్డు యాక్సిడెంట్ అయి కాలు విరిగింది. అప్పటి నుంచి నా ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. హాస్పిటల్​లో చూపించేందుకు నాకున్న రెండెకరాల భూమిలో ఉన్న పత్తిని కూలీలకు ఎక్కువ డబ్బులు ఇచ్చి మరీ తీయించాను. ఇప్పుడు మార్కెట్ ఓపెన్ చేయకపోవడంతో పత్తి ఇంట్లోనే పెట్టుకోవాల్సి వస్తోంది. డబ్బులు అవసరం అని పత్తి తీపిస్తే, ఇలా మార్కెట్ బంద్ చేయడంతో ఇంకా ఇబ్బందుల్లో పడాల్సి వచ్చింది.

- ఇరుకు రామారావు, ముదిగొండ 

సోమవారం నుంచి కొనిపిస్తాం

పత్తి ఖరీదుదారులు, దిగుమతి శాఖ సభ్యులు వారి సమస్యను వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి, ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు కూడా రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్ తో మాట్లాడారు. వారి సమస్య పరిష్కారానికి మంత్రులు హామీ ఇచ్చారు. సోమవారం నుంచి తిరిగి మార్కెట్​లో పత్తి కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం.

- లక్ష్మీప్రసన్న, మార్కెట్ చైర్ పర్సన్, ఖమ్మం