
గ్రేటర్‌లో 25.. జిల్లాల్లో 42 డెత్స్
ట్రీట్మెంట్లో మరో 800 మంది
ప్రైవేట్‌లో కనీసం10 లక్షల బిల్లు
ఆరోగ్యశ్రీలో చేర్చాలన్న వినతులు పట్టించుకోని సర్కార్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కారణంగా గత నెల రోజుల్లోనే 67 మంది చనిపోయారు. మృతుల్లో గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన వాళ్లు 25 మంది ఉండగా, జిల్లాల్లో 42 మరణాలు నమోదయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 8 మంది బ్లాక్‌ఫంగస్‌కు బలయ్యారు. ఆ జిల్లాకు చెందిన సుమారు 50 మంది హైదరాబాద్‌లోని వివిధ హాస్పిటళ్లలో బ్లాక్ ఫంగస్‌కు ట్రీట్‌మెంట్ పొందుతున్నట్టు హెల్త్ ఆఫీసర్లు తెలిపారు. ఆ తర్వాత నిర్మల్, జగిత్యాల, మెదక్ జిల్లాల్లో ఎక్కువ డెత్స్ ఉన్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవగా, ఒకట్రెండు జిల్లాల్లో మాత్రమే మరణాలు నమోదు కాలేదు. ఫంగస్ సింప్టమ్స్ వచ్చిన వెంటనే గుర్తించి, ఎర్లీగా హాస్పిటల్‌కు వచ్చినవాళ్లు కోలుకుంటుండగా, మెదడు వరకూ వ్యాపించినోళ్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 800 మంది వివిధ హాస్పిటళ్లలో బ్లాక్ ఫంగస్ ట్రీట్‌మెంట్ పొందుతున్నారు.
కరోనా కంటే ఎక్కువ ఖర్చు
బ్లాక్ ఫంగస్ బారిన పడి ప్రైవేట్ హాస్పిటళ్లలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నోళ్లకు బిల్లు కనీసం రూ.10 లక్షలు అవుతోంది. ట్రీట్‌మెంట్ కోసం వాడే లైపోజోమల్ ఆంఫోటెరిసిన్ బి ఇంజక్షన్ ధర రూ.7,350 ఉంది. ఒక్కో పేషెంట్‌కు 60 ఇంజక్షన్ల వరకూ వాడుతున్నారు. ఈ ఇంజక్షన్లు, ఇతర మెడిసిన్‌లకే రూ.5 నుంచి 6 లక్షల వరకూ ఖర్చు అవుతోంది. ఫంగస్‌ను తొలగించడానికి చేసే సర్జరీకి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకూ చార్జ్ చేస్తున్నారు. ఇవిగాకుండా బెడ్ చార్జీలు, డాక్టర్ ఫీజులు, టెస్టులతో కలిపి బిల్లు పది లక్షలు దాటుతోంది. ఇన్ఫెక్షన్ కంటికి సోకి కన్ను తీసేయాల్సి వస్తే, బిల్లు రూ.15 లక్షలకు చేరుతోంది. రాష్ట్రంలో 41 ప్రైవేట్ హాస్పిటళ్లు బ్లాక్ ఫంగస్ ట్రీట్‌మెంట్ అందిస్తున్నాయి. వాటి యాజమాన్యాలతో నాలుగైదు రోజుల క్రితం హెల్త్ ఆఫీసర్లు సమావేశం నిర్వహించారు. పేషెంట్లకు రీజనబుల్‌గా బిల్స్ వేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్‌ను హెల్త్ స్కీమ్‌లలో చేర్చగా, మన దగ్గర సర్కార్ అలాంటి ఆలోచన చేయడం లేదు. ఏపీలో కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్‌ను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చారు. ఇక్కడ ఆరోగ్యశ్రీలో చేర్చాలన్న వినతులను సర్కార్ పట్టించుకోవడం లేదు.